పెర్త్ వన్డే: మనోళ్లు మళ్లీ బ్యాట్లెత్తేశారు
పెర్త్: ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మనోళ్లు బ్యాట్లెత్తేశారు. పోరాడకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్లు రహానె (73), ధవన్ (38) మినహా ఇతర బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్లు శుభారంభం అందించినా టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 48.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు ఫిన్ మూడు.. బ్రాడ్, అలీ, వోక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఓపెనర్లు రహానె, ధవన్ జట్టుకు శుభారంభం అందించారు. 20 ఓవర్లలో వీరిద్దరూ 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశలో వోక్స్ బౌలింగ్లో ధవన్ అవుటవడంతో కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత టీమిండియా బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. కోహ్లీ (8), రైనా (1) వెంటవెంటనే అవుటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ అలీ వీరిద్దరినీ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. కోహ్లీ.. రూట్కు, రైనా.. వోక్స్కు క్యాచిచ్చారు. ఆ తర్వాత భారత్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కాసేపటి తర్వాత అంబటి రాయుడు (12) అవుటవగా, నిలకడగా రాణిస్తున్న రహానె కూడా ఫిన్ బౌలింగ్లో అదే దారిపట్టాడు. ఫిన్ మరుసటి ఓవర్లో బిన్నీ అవుటవగా, కెప్టెన్ ధోనీ (17), ఆల్ రౌండర్ జడేజా (5) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. చివర్లో షమీ (25) రాణించడంతో స్కోరు అతికష్టమ్మీద 200 మార్క్ చేరుకుంది. షమీ అవుటవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
ముక్కోణపు సిరీస్లో ఆస్ట్రేలియా ఫైనల్ చేరగా, మరో బెర్తు కోసం ఇంగ్లండ్, భారత్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. సిరీస్లో ఇంగ్లండ్.. భారత్పై బోనస్ పాయింట్తో ఘనవిజయం సాధించింది. కాగా టీమిండియా బోణీ కూడా కొట్టలేకపోయింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ కు రెండు పాయింట్లు వచ్చాయి. భారత్ ఫైనల్ చేరాలంటే తాజా మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. ఈ మాత్రం స్కోరుతో గెలవాలంటే అద్భుతమే జరగాలి.