ముందు మంచి వేదికను తయారు చేసుకోండి.
తమ హోమ్ సిరీస్‌లను యూఏఈలో ఆడించకుండా పాకిస్తాన్‌లోనే జరిపించేందుకు తగిన వేదికను తయారు చేసుకోవాల్సిందిగా బీసీసీఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా పీసీబీకి సూచించారు
పీసీబీకి రాజీవ్ శుక్లా సలహా
కరాచీ: తమ హోమ్ సిరీస్‌లను యూఏఈలో ఆడించకుండా పాకిస్తాన్‌లోనే జరిపించేందుకు తగిన వేదికను తయారు చేసుకోవాల్సిందిగా బీసీసీఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా పీసీబీకి సూచించారు. అలాగైతేనే భారత్... పాకిస్తాన్‌లో ఆడుతుందని తేల్చారు. ఐసీసీకి వారు భద్రతాపరంగా తగిన హామీనిస్తే లాహోర్‌లో ఆడేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. ‘ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఇలాగే తమ సొంత సిరీస్‌లను యూఏఈలో ఆడిస్తే క్రమక్రమంగా వారి దేశంలో క్రికెట్ క్షీణిస్తుంది. నిజానికి లాహోర్‌ను సురక్షిత వేదికగా తయారుచేసుకోవచ్చు. స్టేడియానికి దగ్గరలోనే టీమ్ హోటల్‌ను నిర్మించి తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తే భారత్ అక్కడ ఆడేందుకు సిద్ధమే. అన్ని జట్లు కూడా ఆడేందుకు సుముఖంగానే ఉంటాయి. అయితే దీనికి ముందు వారు ఐసీసీకి భద్రత విషయంలో హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర బోర్డులు కూడా పాక్‌లో ఆడేందుకు అభ్యంతరం వ్యక్తం చేయకూడదు. ఈసారికి వారు భారత్‌కు వచ్చి ఆడితే బావుంటుంది. ఈ విషయంలో నష్టపరిహారం ఇవ్వడానికి కూడా సిద్ధమే’ అని శుక్లా అన్నారు.
ఎంఓయూపై ఒత్తిడి ఉంది: పీసీబీ
పాక్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్‌పై కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) విషయంలో బీసీసీఐపై తీవ్ర ఒత్తిడి నెలకొందని పీసీబీ తెలిపింది. 2015 నుంచి 2023 వరకు ఆరు సిరీస్‌లు జరిగేలా గతంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ వారాంతంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధ్యక్షుడు గైల్స్ క్లార్క్‌తో బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్ సమావేశం కానున్నారని, వీరి మధ్య ఎంఓయూ చర్చకు వచ్చే అవకాశం ఉందని పీసీబీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చీఫ్ నజమ్ సేథీ తెలిపారు. అలాగే త్వరలోనే కామన్వెల్త్ టీమ్‌ను పాక్‌కు పంపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు.