మేలుకుంటే మేలు! | Pujara in test match | Sakshi
Sakshi News home page

మేలుకుంటే మేలు!

Published Tue, Aug 18 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

మేలుకుంటే మేలు!

మేలుకుంటే మేలు!

రాహుల్ ద్రవిడ్ క్రికెట్ ఆడినంతకాలం టెస్టుల్లో అతనికి తుది జట్టులో ఎప్పుడైనా చోటు లేదా? మరి ద్రవిడ్ వారసుడిగా పేరు తెచ్చుకున్న పుజారాకు ఎందుకు తుది జట్టులో స్థానం దక్కడం లేదు? టెస్టు స్పెషలిస్ట్ అనే ముద్ర ఉన్నా విరాట్ కోహ్లి సమయం మొదలయ్యాక అతనెందుకు బెంచ్‌కే పరిమితమవుతున్నాడు? తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యం తర్వాతైనా కోహ్లి, రవిశాస్త్రి ఆలోచించాల్సిన విషయాలివి.
 
- జట్టు ప్రయోజనాలే ముఖ్యం
- పుజారాకు చోటిస్తే మంచిది
- కోహ్లి, శాస్త్రిల ఆలోచన మారాలి

ప్రతి కెప్టెన్‌కూ ఓ శైలి ఉంటుంది. కోహ్లి తన శైలి ఇలాగే ఉండబోతోందంటూ తేల్చేశాడు. టెస్టు మ్యాచ్‌లు గెలవాలంటే కచ్చితంగా ఐదుగురు బౌలర్లుండాలని కుండబద్దలు కొట్టాడు. ఐదుగురు బౌలర్లు, కీపర్ పోగా మిగిలిన స్థానాలు ఐదే. కాబట్టి ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌తో టెస్టు ఆడాలి. ఇందులో ఏ ఇద్దరు సెంచరీలు కొట్టినా సరిపోతుంది. శ్రీలంకతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇదే  జరిగింది. కాబట్టి వెంటనే కోహ్లి ఆలోచన అద్భుతమంటూ మీడియా ఆకాశానికెత్తింది. కానీ రెండు రోజులు తిరిగేసరికి భ్రమలన్నీ తొలగిపోయాయి. 176 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 112 పరుగులకే కుప్పకూలిన వైనంతో భారత క్రికెట్‌కు పెద్ద షాక్ తగిలింది.
 
సరైన అస్త్రాన్ని వదిలేసి...
ఎవరైనా యుద్ధానికి వెళుతున్నప్పుడు తనకు అందుబాటులో ఉన్న అస్త్రాల్లో మెరుగైన వాటిని తీసుకెళ్లాలి. కానీ కోహ్లి మాత్రం టెస్టు క్రికెట్‌లో భారత్‌లో ఉత్తమ ఆటగాడని పేరు తె చ్చుకున్న పుజారా అనే అస్త్రాన్ని పూర్తిగా వదిలేశాడు. ఇక టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి తమ టాప్-5 బ్యాట్స్‌మెన్‌లో పుజారా లేడని బహిరంగంగానే తేల్చేశారు. నిజానికి పుజారాను పక్కన పెట్టడానికి కారణం అతను ఆడిన చివరి 11 టెస్టుల్లో సెంచరీ లేకపోవడం. అయితే ఈ 11 టెస్టుల్లో అతని సగటు రోహిత్ శర్మ సగటు కంటే మెరుగ్గా ఉండటం విశేషం. నిజానికి సెంచరీలే జట్టులో ఉండటానికి కొలమానమైతే రోహిత్ శర్మ తన అరంగేట్రంలో వరుసగా రెండు సెంచరీలు చేసిన తర్వాత మళ్లీ శతకం ఊసే లేదు.

టెక్నిక్ బాగుండాలి
టెస్టుల్లో మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేసే ఆటగాడికి అద్భుతమైన టెక్నిక్ కావాలి. తొలి బంతికే ఓపెనర్ అవుటైతే వెంటనే బరిలోకి దిగాల్సి రావచ్చు. టెస్టుల్లో మూడో స్థానం అత్యంత కీలకం. ద్రవిడ్ ఉన్నంతకాలం తన టెక్నిక్‌తో ఈ స్థానంలో భారత్‌కు ఢోకా లేకుండా పోయింది. తన తర్వాత పుజారా కూడా ఆకట్టుకున్నాడు. పుజారా దగ్గర టెక్నిక్ ఉంది. రోహిత్ బ్యాటింగ్‌లో క్లాస్ ఉంటుంది గానీ టెక్నిక్ తక్కువ. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో తను సరిగా ఆడలేడనే విషయం పలుమార్లు స్పష్టమైంది. ఆస్ట్రేలియాలో లియోన్, ఇంగ్లండ్‌లో మొయిన్ అలీ, బంగ్లాదేశ్‌లో షకీబ్‌ల బౌలింగ్‌లో తన బలహీనతలన్నీ బయటపడ్డాయి.
 
క్లాస్ శాశ్వతమే అయినా...
క్రికెట్‌లో ప్రతిసారీ వినిపించే మాట ‘క్లాస్ శాశ్వతం. ఫామ్ కాదు’ అని. మరి పరుగులు సాధించలేకపోయే క్లాస్‌ని ఏ జట్టైనా ఎంత కాలం భరించగలుగుతుంది? రోహిత్ తన చివరి 19 ఇన్నింగ్స్‌లో కేవలం రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు. ఈ అన్ని ఇన్నింగ్స్‌ల్లోనూ పరుగులు రాకపోవడం కంటే తను అవుటైన విధానం ఆశ్చర్యం కలిగించింది. ఆఫ్‌స్టంప్ బయట వెళ్లే బంతులను వెంటాడటం... ఫుట్‌వర్క్ సరిగా లేకపోవడం... షాట్లు ఆడటంలో బద్దకం చూపించడం.... ఈ మూడు లక్షణాలు తరచుగా కనిపిస్తున్నాయి. వన్డేల్లో అతను బ్యాటింగ్ చేస్తుంటే కళ్లార్పకుండా చూడాలనిపిస్తుంది. కానీ టెస్టుల్లో మాత్రం పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం.
 
కుదురుకుంటే సూపర్
నిజానికి రోహిత్ శర్మ టాలెంట్‌ను ఎవరూ తక్కువ అంచనా వేయరు. తను ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే పరుగులు ధారాళంగా, వేగంగా కూడా వస్తాయి. అయితే దీనికి పుజారా లాంటి క్రికెటర్‌ను పక్కనబెట్టడం కరెక్ట్ కాదు. ఓ క్రికెటర్‌కు కెప్టెన్ అండగా నిలబడటం నిజంగా హర్షించదగిన విషయమే. కోహ్లి కూడా రోహిత్ మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. అయితే తనకు అవకాశం ఇవ్వడం కోసం మరో మంచి ఆటగాడిని బలిపశువును చేయకూడదు. ‘రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. ఓ ఆటగాడు మ్యాచ్ విన్నర్ అని నమ్మితే అతను పరుగులు చేయకపోయినా అవకాశాలు ఇవ్వాలి’ అని తొలి టెస్టు తర్వాత కూడా కోహ్లి వ్యాఖ్యానించాడు. దీనర్థం రెండో టెస్టులోనూ రోహిత్ కొనసాగుతాడనే.
 
వ్యూహాలు మార్చలేరా?

టెస్టు గెలవాలంటే ఐదుగురు బౌలర్లు అవసరమనే వ్యూహం ఉపఖండం పిచ్‌లపై పెద్దగా వర్తించదు. ఏ విదేశీ జట్టు కూడా ఐదుగురు బౌలర్లతో భారత్‌లో, శ్రీలంకలో టెస్టులు ఆడదు. కారణం... ఇక్కడి స్పిన్ వికెట్లు. తొలి టెస్టులో శ్రీలంక కూడా ఇద్దరు స్పిన్నర్లతోనే ఆడింది. నిజానికి భారత్ తరఫున కూడా ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే ప్రభావం చూపారు. అద్భుతమైన స్పిన్ ట్రాక్‌పై కూడా హర్భజన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ చెలరేగి ఆరు వికెట్లు తీస్తే... హర్భజన్ 8 ఓవర్లు మాత్రమే వేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌పై ప్రభావం కాస్త తగ్గినప్పుడు కూడా అశ్విన్ ఆరు వికెట్లు తీస్తే... హర్భజన్ విఫలమయ్యాడు. నిజానికి రోహిత్ పా ర్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్‌గా ఉపయోగపడతాడు. కాబ ట్టి ఈ సిరీస్‌లో మిగిలిన టెస్టుల వరకైనా హర్భజన్‌ను పక్కకు పెట్టి అదనంగా బ్యాట్స్‌మన్‌ను తీసుకోవడం నయం.    
 
ఆలోటు బిన్నీ తీర్చగలడా..?
భారత జట్టుకు మంచి ఆల్‌రౌండర్ లేని లోటు చాలాకాలంగా ఉంది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తాడనుకుంటే అతను జట్టులోకి రావడానికే కష్టపడుతున్నాడు. ఇక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క పిల్ తర్వాత మరొకరు రాలేదు. వన్డే ప్రపంచకప్‌లో పేస్ ఆల్‌రౌండర్‌గా బిన్నీని ఆస్ట్రేలియా తీసుకెళ్లినా ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు. ఇప్పుడు భారత జట్టు అకస్మాత్తుగా బిన్నీని పిలవడానికి కారణం... ఒక ఆల్‌రౌండర్ కావాలని కోరుకోవడమే. ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని మార్చలేక... ఒక బౌలర్‌ను తగ్గించి పేసర్‌ను తీసుకోవాలని భావించి ఉండొచ్చు. అయితే స్పిన్‌కు సహకరించే వికెట్లపై బౌలర్‌గా బిన్నీ ఏ మేరకు ప్రభావం చూపగలడనేది సందేహమే. ఒక్క టెస్టు ముగియగానే జట్టుతో పాటు ఉన్న ఆట గాళ్లను కాదని మరో క్రికెటర్‌ని పిలిపించిన సంప్రదాయం కూడా ఇంతకుముందు లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement