
సాక్షి, హైదరాబాద్: భారత అగ్రశ్రేణి షట్లర్, ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుకు గత కొంత కాలంగా చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. 2019లో ఆమె ఆరు టోర్నమెంట్‌లు ఆడగా ఒక్కదాంట్లో కూడా ఆమె ఫైనల్ చేరలేక పోయింది. రెండు టోర్నీలలో సెమీస్ వరకు రాగలిగింది. అయితే ఏడాది రెండో అర్ధ భాగంలో తాను మంచి ఫలితాలు సాధిస్తానని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ నెల 16నుంచి జరిగే ఇండోనేసియా ఓపెన్‌నుంచి విజయాల బాట పడతానని సింధు చెప్పింది. ‘ఈ సీజన్ నిజంగా గొప్పగా ఏమీ సాగలేదు.
అయితే ఫర్వాలేదని చెప్పగలను. నేను సంతృప్తిగానే ఉన్నా. అయితే ఇంకా మెరుగ్గా ఆడాల్సిందని మాత్రం చెప్పగలను. నా వైపునుంచి లోపాలేమీ లేవు. కానీ కొన్ని సార్లు మనం 100 శాతం ప్రదర్శన ఇవ్వకపోవచ్చు. ఆటలో తప్పులు కూడా జరిగిపోతుంటాయి. ఫలితాలతో కొంత బాధపడ్డా ఎప్పుడైనా వచ్చే సారి మరో అవకాశం ఉంటుందనే విషయం మరచిపోవద్దు’ అని సింధు వ్యాఖ్యానించింది. తనకు దాదాపు నెల రోజుల విరామం లభించిందని, ఈ సమయంలో ఆటతీరు మెరుగుపర్చుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌పై కూడా బాగా దృష్టి పెట్టినట్లు ఆమె పేర్కొంది.
‘ఇప్పుడు ఆటతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉండటం అవసరం. ఎందుకంటే మ్యాచ్‌లు సుదీర్ఘంగా సాగుతున్నాయి. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. వీడియో రికార్డింగ్‌లతో ప్రత్యర్థులు మన ఆటను పట్టేస్తున్నారు. కాబట్టి మళ్లీ మళ్లీ మన ఆటను, శైలిని మార్చుకోవాల్సి వస్తోంది. ఎంతో శ్రమిస్తే గానీ ఒక్కో పాయింట్ లభించడం లేదు’ అని సింధు విశ్లేషించింది. ప్రస్తుతం సింధు కొరియా కోచ్ కిమ్ జి హ్యూన్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment