క్వార్టర్స్‌లో అమెరికా, కొలంబియా
కోపా అమెరికా కప్
ఫిలడెల్ఫియా: టోర్నమెంట్‌లో ముందుకు సాగాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అమెరికా ఫుట్‌బాల్ జట్టు సత్తా చాటింది. పటిష్టమైన డిఫెన్స్‌కు తోడు ఫార్వర్డ్స్ సమయోచిత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దీంతో కోపా అమెరికా కప్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో అమెరికా 1-0తో పరాగ్వేపై విజయం సాధించింది. క్లింట్ డెంప్‌సే (27వ ని.) యూఎస్ తరఫున ఏకైక గోల్ సాధించాడు. తొలి మ్యాచ్‌లో కొలంబియా చేతిలో ఓడినా... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో తిరుగులేని ప్రదర్శనతో చెలరేగిన అమెరికా గ్రూప్ టాపర్‌గా ఆరు పాయింట్లతో క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మరోవైపు 2001 తర్వాత పరాగ్వే గ్రూప్ దశలో వైదొలగడం ఇదే తొలిసారి.
గత రెండు మ్యాచ్‌ల్లో మాదిరిగా లైనప్‌లో ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగిన అమెరికాకు సెంటర్ మిడ్‌ఫీల్డ్‌లో మైకేల్ బ్రాడ్లీ, జోన్స్‌లు అడ్డుగోడలా నిలిచారు. వీళ్ల అండతో ఫార్వర్డ్స్... పరాగ్వేపై దూకుడుగా దాడి చేశారు. అయితే 6వ నిమిషంలో ఫ్యాబిన్ జాన్సన్ (అమెరికా) కొట్టిన కర్లింగ్ ఫ్రీ కిక్ క్రాస్‌బార్ పైనుంచి వెళ్లడంతో తేరుకున్న పరాగ్వే ఒక్కసారిగా కౌంటర్ అటాక్‌కు దిగింది. కానీ 27వ నిమిషంలో లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి జార్డెస్ ఇచ్చిన క్రాస్ పాస్‌ను డెంప్‌సే నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపి అమెరికాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఇప్పటికే క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న కొలంబియా... ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం బోల్తా కొట్టింది. కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌లో కొలంబియా 2-3తో ఓడిపోయింది.