విండీస్కు పరీక్ష పెట్టిన అశ్విన్, సాహా!
► 90ఓవర్లలో భారత్ 234/5
►రాహుల్, అశ్విన్ అర్ధశతకాలు
►రాణించిన వృద్ధిమాన్ సాహా
గ్రాస్‌ఐలట్: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో తొలిసారి భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డా.. చివరికి మనదే పైచేయి అనిపించారు. డారెన్ స్యామీ స్టేడియంలో మంగళవారం మొదలైన మూడో టెస్టులో తొలి రోజు టీ విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసిన జట్టు రవిచంద్రన్ అశ్విన్ (190 బంతుల్లో 75 నాటౌట్ ; 4 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (122 బంతుల్లో 46 నాటౌట్ ; 4 ఫోర్లు) నిలకడ బ్యాటింగ్ తీరుతో 90 ఓవర్లలో ఆట ముగిసే సమయానికి 234/5తో కోలుకుంది. రెండొందల పరుగుల లోపే ఆలౌటవుతుందనుకున్న టీమిండియాను అశ్విన్, సాహా వికెట్లు కోల్పోకుండా ఉండేందుకు ప్రాధాన్యమిస్తూ పట్టుదలతో క్రీజులో నిలిచి, చివరికి తొలిరోజు భారత్కు మంచి భాగస్వామ్యం అందించారు.
టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత బ్యాట్స్ మన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (65 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. రహానే (133 బంతుల్లో 35; 4 ఫోర్లు) సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచినా పెద్దగా పరుగులు చేయలేదు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (1), కోహ్లి (3), రోహిత్ శర్మ (9) విఫలమయ్యారు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన జోసెఫ్ రెండు వికెట్లు తీయగా, ఛేజ్‌కూ రెండు వికెట్లు లభించాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. ఉమేశ్ స్థానంలో భువనేశ్వర్, పుజారా స్థానంలో రోహిత్, మిశ్రా స్థానంలో జడేజా తుది జట్టులోకి వచ్చారు.
విండీస్ కు చుక్కలు చూపించారు!
ఓ దశలో 126/5 తో ఉన్న భారత్ను అశ్విన్, సాహా ఆదుకున్నారు. వికెట్ పడకుండా 40 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసి వీరిద్దరూ విండీస్ బౌలర్ల సహానాన్ని పరీక్షించారు. చివరి సెషన్లో 38 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ జోడీ 104 పరుగులు జత చేసింది. అయితే ఇందులో 46 పరుగులు చివరి 9 ఓవర్లలో వచ్చాయంటేనే ఈ ఇద్దరూ కరీబియన్లను ఎంతగా ఆడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆరో వికెట్ జోడీని విడదీయడానికి విండీస్ విశ్వప్రయత్నాలు చేసినా విజయం సాధించలేక పోయారు. టాపార్డర్ ను సులువుగా పెవిలియన్ బాట పట్టించిన విండీస్ బౌలర్లు అశ్విన్, సాహాలను ఔట్ చేయలేక నానాతిప్పలు పడ్డారు. దీంతో టీ విరామం వరకూ కరీబియన్ ఆటగాళ్లలో ఉన్న ఆనందం తర్వాతి సెషన్ నుంచి కొంచెం కొంచెంగా దూరమైంది. మ్యాచ్ తొలిరోజు నిలిపివేసే సమయానికి భారత్ మాత్రం తమ ప్రదర్శన పట్ల హ్యాపీగా ఉంది. ఈ జోడీ మరిన్ని పరుగులును జత చేస్తే విండీస్ కష్టాలు రెట్టింపవుతాయి.