west indies test series
-
సెంచరీ భాగస్వామ్యం టీమిండియాకు కీలకం
వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ (190 బంతుల్లో 75 నాటౌట్ ; 4 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (122 బంతుల్లో 46 నాటౌట్ ; 4 ఫోర్లు) అజేయ సెంచరీ భాగస్వామ్యం జట్టుకు చాలా కీలకమని భారత ఓపెనర్ లోకేష్ రాహుల్ పేర్కొన్నాడు. 126/5 తో ఉన్న భారత్‌ను అశ్విన్, సాహా విలువైన ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్నారని, బ్యాట్స్ మన్ ఇప్పుడైనా బాధ్యతాయుతంగా క్రీజులో నిలవాలని సూచించాడు. 180-200 పరుగుల లోపే టీమిండియా ఆలౌట్ అవుతుందని తాను భావించానని, అయితే అశ్విన్, సాహా ఆరో వికెట్ కు అజేయ సెంచరీ(108) భాగస్వామ్యంతో భారత్ తిరిగి కోలుకుందన్నాడు. 'బ్యాటింగ్ కు దిగిన వెంటనే పిచ్ పరిస్థితి అర్థం చేసుకున్నాను. పరుగులు చేయడానికి చాలా కష్టంగా ఉంది. అందుకే విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాను. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ విండీస్ పై ఒత్తిడి పెంచాలనుకున్నాను. విండీస్ బౌలర్లు రాణించారు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో ఇబ్బందిపెట్టారు' అని రాహుల్ వివరించాడు. ఆరంభంలో త్వరగా వికెట్లు కోల్పోయినా చివరికి తొలిరోజు ఆటతో చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపాడు. లోకేష్ రాహుల్ (65 బంతుల్లో 50; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. -
విండీస్‌కు పరీక్ష పెట్టిన అశ్విన్, సాహా!
► 90ఓవర్లలో భారత్ 234/5 ►రాహుల్, అశ్విన్ అర్ధశతకాలు ►రాణించిన వృద్ధిమాన్ సాహా గ్రాస్‌ఐలట్: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో తొలిసారి భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డా.. చివరికి మనదే పైచేయి అనిపించారు. డారెన్ స్యామీ స్టేడియంలో మంగళవారం మొదలైన మూడో టెస్టులో తొలి రోజు టీ విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసిన జట్టు రవిచంద్రన్ అశ్విన్ (190 బంతుల్లో 75 నాటౌట్ ; 4 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (122 బంతుల్లో 46 నాటౌట్ ; 4 ఫోర్లు) నిలకడ బ్యాటింగ్ తీరుతో 90 ఓవర్లలో ఆట ముగిసే సమయానికి 234/5తో కోలుకుంది. రెండొందల పరుగుల లోపే ఆలౌటవుతుందనుకున్న టీమిండియాను అశ్విన్, సాహా వికెట్లు కోల్పోకుండా ఉండేందుకు ప్రాధాన్యమిస్తూ పట్టుదలతో క్రీజులో నిలిచి, చివరికి తొలిరోజు భారత్‌కు మంచి భాగస్వామ్యం అందించారు. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత బ్యాట్స్ మన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (65 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. రహానే (133 బంతుల్లో 35; 4 ఫోర్లు) సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచినా పెద్దగా పరుగులు చేయలేదు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (1), కోహ్లి (3), రోహిత్ శర్మ (9) విఫలమయ్యారు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన జోసెఫ్ రెండు వికెట్లు తీయగా, ఛేజ్‌కూ రెండు వికెట్లు లభించాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. ఉమేశ్ స్థానంలో భువనేశ్వర్, పుజారా స్థానంలో రోహిత్, మిశ్రా స్థానంలో జడేజా తుది జట్టులోకి వచ్చారు. విండీస్ కు చుక్కలు చూపించారు! ఓ దశలో 126/5 తో ఉన్న భారత్‌ను అశ్విన్, సాహా ఆదుకున్నారు. వికెట్ పడకుండా 40 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసి వీరిద్దరూ విండీస్ బౌలర్ల సహానాన్ని పరీక్షించారు. చివరి సెషన్లో 38 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ జోడీ 104 పరుగులు జత చేసింది. అయితే ఇందులో 46 పరుగులు చివరి 9 ఓవర్లలో వచ్చాయంటేనే ఈ ఇద్దరూ కరీబియన్లను ఎంతగా ఆడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆరో వికెట్ జోడీని విడదీయడానికి విండీస్ విశ్వప్రయత్నాలు చేసినా విజయం సాధించలేక పోయారు. టాపార్డర్ ను సులువుగా పెవిలియన్ బాట పట్టించిన విండీస్ బౌలర్లు అశ్విన్, సాహాలను ఔట్ చేయలేక నానాతిప్పలు పడ్డారు. దీంతో టీ విరామం వరకూ కరీబియన్ ఆటగాళ్లలో ఉన్న ఆనందం తర్వాతి సెషన్ నుంచి కొంచెం కొంచెంగా దూరమైంది. మ్యాచ్ తొలిరోజు నిలిపివేసే సమయానికి భారత్ మాత్రం తమ ప్రదర్శన పట్ల హ్యాపీగా ఉంది. ఈ జోడీ మరిన్ని పరుగులును జత చేస్తే విండీస్ కష్టాలు రెట్టింపవుతాయి. -
తడబడిన భారత్
♦ భారత్ 130/5 రాహుల్ అర్ధసెంచరీ ♦ వెస్టిండీస్‌తో మూడో టెస్టు గ్రాస్‌ఐలట్: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో తొలిసారి భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. డారెన్ స్యామీ స్టేడియంలో మంగళవారం మొదలైన మూడో టెస్టులో తొలి రోజు టీ విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (65 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. రహానే (133 బంతుల్లో 35; 4 ఫోర్లు) సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచినా పెద్దగా పరుగులు చేయలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ (1), కోహ్లి (3) విఫలమయ్యారు. రోహిత్ శర్మ (9) కూడా విఫలమయ్యాడు. అశ్విన్ (23 బ్యాటింగ్), సాహా (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన జోసెఫ్ రెండు వికెట్లు తీయగా... ఛేజ్‌కూ రెండు వికెట్లు లభించాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. ఉమేశ్ స్థానంలో భువనేశ్వర్, పుజారా స్థానంలో రోహిత్, మిశ్రా స్థానంలో జడేజా తుది జట్టులోకి వచ్చారు. టాస్ వెస్టిండీస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) బ్రాత్‌వైట్ (బి) ఛేజ్ 50; ధావన్ (సి) డౌరిచ్ (బి) గాబ్రియెల్ 1; కోహ్లి (సి) బ్రేవో (బి) జోసెఫ్ 3; రహానే (బి) ఛేజ్ 35; రోహిత్ శర్మ (సి) డౌరిచ్ (బి) జోసెఫ్ 9; అశ్విన్ బ్యాటింగ్ 23; సాహా బ్యాటింగ్ 1; ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (52 ఓవర్లలో 5 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1-9; 2-19; 3-77; 4-87; 5-126. బౌలింగ్: గాబ్రియెల్ 11-2-40-1, జోసెఫ్ 9-3-20-2, కమిన్స్ 10-4-28-0, హోల్డర్ 9-4-14-0, ఛేజ్ 11-4-15-2, బ్రాత్‌వైట్ 2-0-7-0. -
ఇదీ ఏకపక్షమే (నా)!
మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం బ్యాట్స్‌మెన్ సూపర్ ఫామ్‌తో విండీస్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టిపెట్టింది. ఫార్మాట్‌కు అనుగుణంగా తన ఆటతీరును మార్చుకుంటున్న ధోనిసేన మ్యాచ్‌లను ఏకపక్షంగా మార్చేస్తోంది. దీంతో బలమైన ప్రత్యర్థి జట్లు కూడా విజయం ముంగిట బోల్తా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు విండీస్‌తో ప్రారంభ మయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనైనా పోటీ ఉంటుందో.. మళ్లీ ఏకపక్షమో చూడాలి! కొచ్చి: భారత బ్యాటింగ్ బలానికి... కరీబియన్ ఆల్‌రౌండర్ల జోరుకు ఇప్పుడు వన్డే సిరీస్ వేదిక కానుంది. సచిన్ టెండూల్కర్ ‘ఫేర్వెల్ టెస్టు సిరీస్’ను క్లీన్‌స్వీప్ చేసిన ధోనిసేన వన్డేల్లోనూ అదే అధిపత్యాన్ని కనబర్చాలని భావిస్తుండగా... పోయిన పరువును కొంతైనా కాపాడుకోవాలని బ్రేవోసేన ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే నేడు కొచ్చిలో జరగనుంది. ఓ భావోద్వేగ సిరీస్‌ను ఘనంగా ముగించిన భారత్... ఇప్పుడు క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. టెస్టుల్లో రాణించిన చాలా మంది ఆటగాళ్లు వన్డే జట్టులోనూ ఉండటం వల్ల ఈ సిరీస్‌లోనూ భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఆసీస్‌పై విశేషంగా రాణించిన ఓపెనింగ్ జోడి రోహిత్, ధావన్‌లు కుదురుకుంటే భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేసిన రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం... వన్‌డౌన్‌లో వచ్చే కోహ్లి చివరి వరకు ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలవడం భారత్‌కు కలిసొచ్చే అంశాలు. మిడిలార్డర్లో ధోని మంచి ఫామ్‌లో ఉన్నా... రైనా, యువరాజ్ భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఉంది. టెస్టు సిరీస్‌కు దూరమైన ఆల్‌రౌండర్ జడేజా మళ్లీ జట్టులోకి రావడంతో మంచి సమతుల్యం కనబడుతోంది. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, షమీలకు తోడుగా ఉనాద్కట్ లేదా మోహిత్ శర్మలలో ఒక్కరికి అవకాశం దక్కొచ్చు. అశ్విన్‌కు తోడుగా పార్ట్‌టైమ్ స్పిన్నర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో మిశ్రాకు అవకాశం రాకపోవచ్చు. టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడిన విండీస్... వన్డేల్లోనైనా ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చాలని ప్రణాళికలు రచిస్తోంది. స్యామీ స్థానంలో ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్ క్రిస్‌గేల్ క్రీజులో నిలబడితే భారత్‌కు కష్టాలు తప్పవు. భారీ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్న చార్లెస్, దేవ్‌నారాయణ్, డారెన్ బ్రేవో, శామ్యూల్స్, రామ్దిన్లపైనే బ్యాటింగ్ బలం ఆధారపడి ఉంది. అయితే వీరిలో నిలకడ లేకపోవడం కాస్త ఆందోళన కలిగించే అంశం. పొలార్డ్ జట్టుకు అందుబాటులో లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. భారత వికెట్లపై పేస్ త్రయం సిమ్మన్స్, స్యామీ, రాంపాల్ ప్రభావం చూపినా... నరైన్ స్పిన్ మ్యాజిక్‌పైనే జట్టు విజయం ఆధారపడి ఉంది. కాబట్టి భారత బ్యాటింగ్ బలానికి, విండీస్ ఆల్‌రౌండర్ల నైపుణ్యానికి ఈ మ్యాచ్ పరీక్షగా నిలవనుంది. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఉనాద్కట్ / మోహిత్ శర్మ. వెస్టిండీస్: డ్వేన్ బ్రేవో (కెప్టెన్), గేల్, చార్లెస్, డారెన్ బ్రేవో, శామ్యూల్స్, దేవ్‌నారాయణ్, సిమ్మన్స్, స్యామీ, నరైన్, రాంపాల్, హోల్డర్. సచిన్ పెవిలియన్ ఆవిష్కరణ వెస్టిండీస్‌తో తొలి వన్డేకు వేదికైన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన సచిన్ టెండూల్కర్ పెవిలియన్‌ను కెప్టెన్ ధోని బుధవారం ఆవిష్కరించాడు. సచిన్ ఫొటోలు, సంతకంతో కూడిన జెర్సీ, ముంబై ఇండియన్స్ సహచరుల సంతకాలతో కూడిన బ్యాట్, మాస్టర్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో మర్చిపోలేని ఇన్నింగ్స్‌కు సంబంధించిన ఫొటోలు ఈ పెవిలియన్‌లో ఏర్పాటు చేశారు. మాస్టర్ భార్య అంజలి, కూతురు సారా, కుమారుడు అర్జున్‌ల ఫొటోలను కూడా ఉంచారు. సచిన్ సంతకం చేసిన బ్యాట్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) వెల్లడించింది. కెరీర్లో సచిన్ చేసిన 100 సెంచరీలకు గుర్తుగా వంద బంతులను ప్రదర్శనకు ఉంచారు. ప్రతి బంతిపై మ్యాచ్ జరిగిన తేదీని రాశారు. పరుగుల వర్షం ? కొచ్చిలో మ్యాచ్‌కు వరుణుడి నుంచి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ పిచ్‌ను గమనిస్తే పరుగుల వర్షం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్‌లో వన్డేల్లో భారీ స్కోర్లు వస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో బౌలర్ల పరిస్థితి ఎలా ఉండబోతుందో..?