ఇదీ ఏకపక్షమే (నా)! | Back to familiar format after emotional farewell | Sakshi
Sakshi News home page

ఇదీ ఏకపక్షమే (నా)!

Published Thu, Nov 21 2013 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

ఇదీ ఏకపక్షమే (నా)!

ఇదీ ఏకపక్షమే (నా)!

మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
 బ్యాట్స్‌మెన్ సూపర్ ఫామ్‌తో విండీస్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టిపెట్టింది. ఫార్మాట్‌కు అనుగుణంగా తన ఆటతీరును మార్చుకుంటున్న ధోనిసేన  మ్యాచ్‌లను ఏకపక్షంగా మార్చేస్తోంది. దీంతో బలమైన ప్రత్యర్థి జట్లు కూడా విజయం ముంగిట బోల్తా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు విండీస్‌తో ప్రారంభ మయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనైనా పోటీ ఉంటుందో.. మళ్లీ ఏకపక్షమో చూడాలి!
 
 కొచ్చి: భారత బ్యాటింగ్ బలానికి... కరీబియన్ ఆల్‌రౌండర్ల జోరుకు ఇప్పుడు వన్డే సిరీస్ వేదిక కానుంది. సచిన్ టెండూల్కర్ ‘ఫేర్‌వెల్ టెస్టు సిరీస్’ను క్లీన్‌స్వీప్ చేసిన ధోనిసేన వన్డేల్లోనూ అదే అధిపత్యాన్ని కనబర్చాలని భావిస్తుండగా... పోయిన పరువును కొంతైనా కాపాడుకోవాలని బ్రేవోసేన ప్రయత్నిస్తోంది.
 
 ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య  తొలి వన్డే నేడు కొచ్చిలో జరగనుంది. ఓ భావోద్వేగ సిరీస్‌ను ఘనంగా ముగించిన భారత్... ఇప్పుడు క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. టెస్టుల్లో రాణించిన చాలా మంది ఆటగాళ్లు వన్డే జట్టులోనూ ఉండటం వల్ల ఈ సిరీస్‌లోనూ భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఆసీస్‌పై విశేషంగా రాణించిన ఓపెనింగ్ జోడి రోహిత్, ధావన్‌లు కుదురుకుంటే భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
 
  ముఖ్యంగా వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేసిన రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం... వన్‌డౌన్‌లో వచ్చే కోహ్లి చివరి వరకు ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలవడం భారత్‌కు కలిసొచ్చే అంశాలు. మిడిలార్డర్‌లో ధోని మంచి ఫామ్‌లో ఉన్నా... రైనా, యువరాజ్ భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఉంది. టెస్టు సిరీస్‌కు దూరమైన ఆల్‌రౌండర్ జడేజా మళ్లీ జట్టులోకి రావడంతో మంచి సమతుల్యం కనబడుతోంది. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, షమీలకు తోడుగా ఉనాద్కట్ లేదా మోహిత్ శర్మలలో ఒక్కరికి అవకాశం దక్కొచ్చు. అశ్విన్‌కు తోడుగా పార్ట్‌టైమ్ స్పిన్నర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో మిశ్రాకు అవకాశం రాకపోవచ్చు.  
 
 టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడిన విండీస్... వన్డేల్లోనైనా ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చాలని ప్రణాళికలు రచిస్తోంది. స్యామీ స్థానంలో ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్ క్రిస్‌గేల్ క్రీజులో నిలబడితే భారత్‌కు కష్టాలు తప్పవు. భారీ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్న చార్లెస్, దేవ్‌నారాయణ్, డారెన్ బ్రేవో, శామ్యూల్స్, రామ్‌దిన్‌లపైనే బ్యాటింగ్ బలం ఆధారపడి ఉంది. అయితే వీరిలో నిలకడ లేకపోవడం కాస్త ఆందోళన కలిగించే అంశం. పొలార్డ్ జట్టుకు అందుబాటులో లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. భారత వికెట్లపై పేస్ త్రయం సిమ్మన్స్, స్యామీ, రాంపాల్ ప్రభావం చూపినా... నరైన్ స్పిన్ మ్యాజిక్‌పైనే జట్టు విజయం ఆధారపడి ఉంది. కాబట్టి భారత బ్యాటింగ్ బలానికి, విండీస్ ఆల్‌రౌండర్ల నైపుణ్యానికి ఈ మ్యాచ్ పరీక్షగా నిలవనుంది.
 
 జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఉనాద్కట్ / మోహిత్ శర్మ.
 
 వెస్టిండీస్: డ్వేన్ బ్రేవో (కెప్టెన్), గేల్, చార్లెస్, డారెన్ బ్రేవో, శామ్యూల్స్, దేవ్‌నారాయణ్, సిమ్మన్స్, స్యామీ, నరైన్, రాంపాల్, హోల్డర్.
 
 సచిన్ పెవిలియన్ ఆవిష్కరణ
 వెస్టిండీస్‌తో తొలి వన్డేకు వేదికైన జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన సచిన్ టెండూల్కర్ పెవిలియన్‌ను కెప్టెన్ ధోని బుధవారం ఆవిష్కరించాడు. సచిన్ ఫొటోలు, సంతకంతో కూడిన జెర్సీ, ముంబై ఇండియన్స్ సహచరుల సంతకాలతో కూడిన బ్యాట్, మాస్టర్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మర్చిపోలేని ఇన్నింగ్స్‌కు సంబంధించిన ఫొటోలు ఈ పెవిలియన్‌లో ఏర్పాటు చేశారు.
 
 మాస్టర్ భార్య అంజలి, కూతురు సారా, కుమారుడు అర్జున్‌ల ఫొటోలను కూడా ఉంచారు. సచిన్ సంతకం చేసిన బ్యాట్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) వెల్లడించింది. కెరీర్‌లో సచిన్ చేసిన 100 సెంచరీలకు గుర్తుగా వంద బంతులను ప్రదర్శనకు ఉంచారు. ప్రతి బంతిపై మ్యాచ్ జరిగిన తేదీని రాశారు.
 
 పరుగుల వర్షం ?
 కొచ్చిలో మ్యాచ్‌కు వరుణుడి నుంచి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ పిచ్‌ను గమనిస్తే పరుగుల వర్షం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్‌లో వన్డేల్లో భారీ స్కోర్లు వస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో బౌలర్ల పరిస్థితి ఎలా ఉండబోతుందో..?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement