వన్డేల్లోనైనా నిలబడతారా..!
ఒక వైపు భీకర ఫామ్‌లో భారత జట్టు...350కు పైగా పరుగుల విజయలక్ష్యాన్ని కూడా సునాయాసంగా అందుకుంటూ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. మరో వైపు చేవ లేకుండా చేతులెత్తేస్తున్న వెస్టిండీస్ జట్టు...ఒక్క టెస్టు ఇన్నింగ్స్‌లోనూ కనీసం వంద ఓవర్లు ఆడలేని బ్యాట్స్‌మెన్, పేలవ బౌలింగ్‌తో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇలాంటి అంతరాల మధ్య ఇరు జట్లు వన్డే సిరీస్‌లో పోటీ పడనున్నాయి. టెస్టు జట్టుతో పోలిస్తే వన్డే టీమ్‌లో జరిగిన మార్పులు విండీస్‌కు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.
కొచ్చి: యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను ముగించింది. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్‌లో పడి అభిమానులంతా కొన్నాళ్లు మన కుర్రాళ్ల ప్రతాపాన్ని మరచిపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ వన్డే సిరీస్ పోరుకు ధోని సేన సిద్ధమైంది. బలహీనమైన వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి తమ నంబర్‌వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. కనీసం వన్డేల్లోనైనా చెప్పుకోదగ్గ ఆటతీరుతో పరువు నిలబెట్టుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది.
గేల్ ఇప్పుడైనా...
టెస్టు సిరీస్ ఆడిన వెస్టిండీస్ జట్టులో పలు మార్పులతో వన్డే టీమ్‌ను ఎంపిక చేశారు. టెస్టులతో పోలిస్తే పరిమిత ఓవర్లలో తమను తాము నిరూపించుకున్న కొంత మంది ఆటగాళ్లు జట్టులో ఉండటం విండీస్ బలం. ముఖ్యంగా కెప్టెన్ డ్వేన్ బ్రేవో వన్డేల్లో కీలకమైన ఆల్‌రౌండర్ పాత్ర పోషించనున్నాడు. ధాటిగా ఆడే ఓపెనర్ జాన్సన్ చార్లెస్‌కు కూడా చోటు దక్కింది. ఐపీఎల్ స్టార్లు సునీల్ నరైన్, జాసన్ హోల్డర్లు టీమ్‌లో ఉన్నారు. సీనియర్లలో శామ్యూల్స్, స్యామీ, రామ్‌దిన్ వన్డే టీమ్‌లోనూ స్థానాలు నిలబెట్టుకోగలిగారు. అయితే వెస్టిండీస్ విజయావకాశాలు మరో సారి స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్‌పైనే ఆధార పడి ఉన్నాయి. టి20 లీగ్‌ల్లో విధ్వంసం సృష్టించే గేల్ సొంత జట్టుకు ఎప్పుడూ ఉపయోగపడలేదనే అపవాదు ఉంది. ఈ సారి టెస్టు సిరీస్‌తో అది మరో సారి నిరూపితం అయింది. మరి వన్డేల్లో ఏం చేస్తాడో చూడాలి.
అందరూ స్టార్లే...
చాలా కాలంగా వన్డేల్లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న నంబర్‌వన్ భారత్ కోణంలో చూస్తే ఈ సిరీస్ కూడా జట్టు ఖాతాలోకి పడేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ ధోని స్ఫూర్తిదాయక నాయకత్వంలో యువ ఆటగాళ్లందరూ ఇప్పటికే తమ సత్తా చాటుకున్నారు. రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి, రైనాలతో జట్టు బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. టెస్టుల్లో లేని జడేజా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆసీస్‌తో ఘోరంగా విఫలమైన యువరాజ్‌కు మాత్రం ఇది పరీక్షా సమయం. విండీస్ కనీస ప్రతిఘటన ఇస్తుందా...లేక భారత్‌కు కొత్త రికార్డులు అప్పజెపుతుందా అన్నది ఆసక్తికరం.
‘తాగి ఉన్నారేమో’
మరో వైపు టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ ఆటతీరుపై ఆ దేశ దిగ్గజం, మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ తీవ్ర విమర్శలు చేశారు. టి20 మత్తులో జట్టు ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ...‘ఇంకా దానిని మత్తు అనుకుందామా...నాకు తెలిసి వారు టి20లను తాగి అందులోనే మునిగిపోయారేమో’ అని లాయిడ్ అన్నారు.
సచిన్ పెవిలియన్...
కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని పెవిలియన్‌కు సచిన్ టెండూల్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. తొలి వన్డే సందర్భంగా బుధవారం ఈ స్టాండ్‌ను భారత కెప్టెన్ ధోని ఆవిష్కరిస్తాడు. మరో వైపు మ్యాచ్‌లో ఆడేందుకు వెస్టిండీస్ టీమ్ మంగళవారం ఇక్కడికి చేరుకుంది. కేరళ సాంప్రదాయ మోహినీ అట్టం, కథాకళి నృత్యాలతో వారికి ఆహ్వానం లభించింది.
వన్డే సిరీస్ షెడ్యూల్
తొలి వన్డే నవంబర్ 21 కొచ్చి
రెండో వన్డే నవంబర్ 24 విశాఖపట్నం
మూడో వన్డే నవంబర్ 27 కాన్పూర్
రెండేళ్ల క్రితం ఇరు జట్ల మధ్య భారత్‌లో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 4-1తో విండీస్‌ను చిత్తు చేసింది.