సెంచరీ భాగస్వామ్యం టీమిండియాకు కీలకం
వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ (190 బంతుల్లో 75 నాటౌట్ ; 4 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (122 బంతుల్లో 46 నాటౌట్ ; 4 ఫోర్లు) అజేయ సెంచరీ భాగస్వామ్యం జట్టుకు చాలా కీలకమని భారత ఓపెనర్ లోకేష్ రాహుల్ పేర్కొన్నాడు. 126/5 తో ఉన్న భారత్ను అశ్విన్, సాహా విలువైన ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్నారని, బ్యాట్స్ మన్ ఇప్పుడైనా బాధ్యతాయుతంగా క్రీజులో నిలవాలని సూచించాడు. 180-200 పరుగుల లోపే టీమిండియా ఆలౌట్ అవుతుందని తాను భావించానని, అయితే అశ్విన్, సాహా ఆరో వికెట్ కు అజేయ సెంచరీ(108) భాగస్వామ్యంతో భారత్ తిరిగి కోలుకుందన్నాడు.
'బ్యాటింగ్ కు దిగిన వెంటనే పిచ్ పరిస్థితి అర్థం చేసుకున్నాను. పరుగులు చేయడానికి చాలా కష్టంగా ఉంది. అందుకే విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాను. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ విండీస్ పై ఒత్తిడి పెంచాలనుకున్నాను. విండీస్ బౌలర్లు రాణించారు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో ఇబ్బందిపెట్టారు' అని రాహుల్ వివరించాడు. ఆరంభంలో త్వరగా వికెట్లు కోల్పోయినా చివరికి తొలిరోజు ఆటతో చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపాడు. లోకేష్ రాహుల్ (65 బంతుల్లో 50; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే.