ద్రవిడ్ ‘స్కూల్ ఆఫ్ క్రికెట్’
రాజస్థాన్‌కు దిగ్గజం అండ
మెంటర్‌గా ద్రవిడ్ భిన్నమైన శైలి
రాయల్స్ పురోగతిలో కీలక పాత్ర
సాక్షి క్రీడావిభాగం
ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుతో మ్యాచ్‌కు ముందు రోజు రాజస్థాన్ రాయల్స్ ప్రాక్టీస్ సెషన్...అందరికంటే ముందుగా మైదానంలోకి జట్టు మెంటర్ రాహుల్ ద్రవిడ్ వచ్చాడు. అతడిని అనుసరించిన ఆటగాళ్లు వార్మప్‌లో మునిగిపోయారు. ఆలోగా గ్రౌండ్‌లో ఒక మూలకు వెళ్లిన ద్రవిడ్... వైట్ బోర్డు, మార్కర్‌తో సిద్ధమయ్యాడు. ప్లేయర్లు ఎక్సర్‌సైజ్ చేసి తిరిగొచ్చే సరికి అది ఒక మ్యాథమెటిక్స్ క్లాస్‌లాగా కనిపించింది. దానిపై స్పష్టంగా నెట్ సెషన్ వివరాలు రాసి ఉన్నాయి.
అందుబాటులో ఉన్న నాలుగు పిచ్‌లపై ఎవరెవరు బౌలింగ్ చేయాలో, ఎంత సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలో రాశాడు. అలాగే స్పిన్నర్ కొరకు, పేసర్ కొరకు ప్రత్యేకంగా సూచనలు అన్నీ ఆ బోర్డుపై రాసి ఉన్నాయి. సాధారణంగా ప్రాక్టీస్ సెషన్‌లో మనకు ఇలాంటిది ఎక్కడా కనిపించదు. కోచ్‌లు నోటిమాటతో ఇలాంటివి చెబుతూ ప్రాక్టీస్‌లో భాగమవుతారు. కానీ మిస్టర్ పర్‌ఫెక్ట్‌కు అన్నీ పక్కాగా ఉండాలి మరి!
మార్గదర్శకత్వం
వాస్తవానికి రాయల్స్ జట్టుకు ప్యాడీ ఆప్టన్ రూపంలో పూర్తి స్థాయి కోచ్ ఉన్నారు. ఇక ఇతర ఐపీఎల్ జట్లలో ఉన్న మెంటర్‌లను చూస్తే ఒక సీనియర్ ఆటగాడికి మర్యాదపూర్వక హోదా కోసమే నియమించినట్లు అనిపిస్తుంది. కానీ ద్రవిడ్ మాత్రం అందరికంటే భిన్నం. గతంలో ఇదే జట్టుకు ఆడిన సమయంలో ఎంత అంకితభావం కనబర్చాడో ఇప్పుడు మెంటర్‌గా కూడా రాజస్థాన్‌కు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు.
మొత్తం జట్టు ఎంపిక, తుది 11 మంది కూర్పు, విదేశీ ఆటగాళ్లను తగిన విధంగా వాడుకోవడం, వ్యూహాలు, కుర్రాళ్లకు నైతిక విలువలపై క్లాస్‌లతో బిజీ బిజీ...ఇలా ద్రవిడ్ చుట్టూనే రాయల్స్ ఉందంటే అతిశయోక్తి కాదు. దీని ఫలితంగానే రాజస్థాన్ మరో సారి మంచి విజయాలు సాధిస్తోంది. ఈ సీజన్‌లో ఆరు మ్యాచుల్లో ఆ జట్టు నాలుగు గెలిచింది. ఒక మ్యాచ్‌లో చెన్నైని తక్కువ స్కోరుకే కట్టడి చేయగా, మరో మ్యాచ్‌లో 191 పరుగులు చేసినా, మ్యాక్స్‌వెల్ సంచలన ఇన్నింగ్స్ రాయల్స్‌కు గెలుపును దూరం చేసింది.
స్టార్ల అవరం లేకుండానే...
ఈ సీజన్ ఆరంభానికి ముందు వేలంలోనూ ద్రవిడ్ ముద్ర స్పష్టంగా కనిపించింది. ఐదుగురు ఆటగాళ్లను కొనసాగించేందుకు భారీ మొత్తం ఖర్చు చేసిన తర్వాత కూడా రాజస్థాన్ ఖాతాలో చివరకు డబ్బులు మిగలడం విశేషం. ఐపీఎల్ తొలి ఏడాదినుంచి రాజస్థాన్ అండర్‌డాగ్స్‌గానే బరిలోకి దిగుతోంది. వాట్సన్ మినహా భారీ షాట్లతో విరుచుకు పడే ఆటగాళ్లు ఆ జట్టులో లేరు. అయితే ఈ సారి కూడా పరిమిత వనరులతోనే జట్టును సిద్ధం చేయడంలో భారత మాజీ కెప్టెన్ తన అనుభవాన్నంతా ఉపయోగిస్తున్నాడు.
తనను కోల్‌కతా సరిగా ఉపయోగించుకోలేకపోయిందన్న రజత్ భాటియా ఇప్పుడు రాజస్థాన్ విజయాల్లో కీలకంగా మారాడు. ఇక 43 ఏళ్ల వయసులోనూ అద్భుతాలు చేస్తున్న ప్రవీణ్ తాంబే తన ప్రదర్శనకు ద్రవిడే కారణంగా చెప్పాడు. ఇక రంజీ ట్రోఫీ నాకౌట్ దశలో వరుసగా మూడు సెంచరీలు సాధించినా ఎవరికీ తెలీని కరుణ్ నాయర్...ఇప్పుడు ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌తో అందరికీ పరిచయమయ్యాడు. ఈ కర్ణాటక క్రికెటర్‌ను జట్టులోకి తెచ్చింది ద్రవిడే. కివీస్ ఆటగాడు కేన్ రిచర్డ్సన్ ప్రతిభను కూడా గుర్తించి ద్రవిడ్ అతనికి వరుస అవకాశాలు ఇచ్చాడు.
మున్ముందు సవాల్
ఒకే తుది జట్టుకు పరిమితం కాకుండా ఈ సారి లీగ్‌లో ఎక్కువ మంది ఆటగాళ్లను ఆడించిన జట్టు రాజస్థాన్. అయినా సరే, గతంలో రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్రాడ్ హాడ్జ్, కెవాన్ కూపర్‌లు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అండర్-19 ప్రపంచకప్ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్, ఇటీవల భారత అండర్-19కు ఆడిన అంకుశ్ బైన్స్, దీపక్ హుడా రాజస్థాన్ జట్టులోనే ఉన్నారు. వీరందరినీ తగిన విధంగా వచ్చే మ్యాచుల్లో వాడుకోవాలనేది ద్రవిడ్ వ్యూహం కావచ్చు. గత ఏడాది వివాదాల బారినుంచి దూరంగా ఈ సారి జట్టుకు ద్రవిడ్ విజయవంతంగా మార్గనిర్దేశనం చేశాడు. అయితే చివరకు ఐపీఎల్ విజేతగా నిలవడమే ఏ జట్టు లక్ష్యమైనా.
ఇప్పుడు ద్రవిడ్ ఆ బాధ్యతను తాను తీసుకున్నాడు. మైదానంలో బరిలోకి దిగకపోయినా అతని సాహచర్యం ఆ జట్టుకు అమూల్యం. ఇక చెన్నై సూపర్ పవర్‌గా కనిపిస్తుంటే, పంజాబ్ ఒక్కసారిగా బలంగా మారింది. ఈ నేపథ్యంలో టైటిల్ గెలిస్తే ఆ ఘనతలో అగ్ర భాగం ద్రవిడ్‌కే దక్కుతుంది. అన్నట్లు... గతంలో ఒక సారి భారత కోచ్ పదవి గురించి ప్రస్తావిస్తే ద్రవిడ్ సమయం లేదన్నాడే గానీ, చేయననలేదు. ఇప్పుడు అతని కోచింగ్ శైలి, దూరదృష్టి చూస్తే భారత్‌కు అతను కోచ్ అయ్యే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది!