ఐపీఎల్ ఫైనల్కు వానగండం
బెంగళూరు: దాదాపు రెండు నెలలుగా ఆసక్తిగా సాగుతున్న ఐపీఎల్ సమరం ముగింపు దశకు చేరుకుంది. ఫైనల్ పోరులో విజయం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుదా? లేక సన్ రైజర్స్ హైదరాబాద్దా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ రోజు రాత్రి జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్సుకతతో ఉన్నారు. అయితే ఐపీఎల్ ఫైనల్ పోరుకు వర్షం రూపంలో గండం పొంచిఉంది. బెంగళూరు నగరంలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా బెంగళూరు, హైదరాబాద్ జట్ల ప్రాక్టీస్కు కూడా అంతరాయం ఏర్పడింది. బెంగళూరులో ఈ రోజు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగిస్తే పరిస్థితి ఏంటి?
- వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ నిర్వహించడానికి సాధ్యంకాకపోతే బీసీసీఐ నిబంధనల ప్రకారం సోమవారం రిజర్వ్ డే ఉంది.
- ఈ రోజు వర్షం కారణంగా ఆలస్యమైతే.. మ్యాచ్ నిర్వహించడానికి అర్ధరాత్రి 12:26 గంటల వరకు సమయం ఉంది. ఐదు ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహిస్తారు.
- ఈ రోజు మ్యాచ్ మొదలయిన తర్వాత వర్షం కారణంగా ఆగిపోతే.. మిగిలిన ఆటను మరుసటి రోజు అనగా సోమవారం కొనసాగిస్తారు.
- ఈ రోజు టాస్ వేసిన తర్వాత మ్యాచ్ ఆరంభంకాకుంటే.. రేపు 20 ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహిస్తారు. ఇరు జట్లు కొత్తగా ఫైనల్ లెవెన్ జట్లను ఎంపిక చేసుకోవచ్చు.
- రేపు కూడా 5 ఓవర్ల మ్యాచ్ సాధ్యంకాకపోతే.. విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహిస్తారు.
- సూపర్ ఓవర్ కూడా సాధ్యంకాని పక్షంలో లీగ్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టును విజేతగా ఎంపిక చేస్తారు. కాగా లీగ్ దశలో హైదరాబాద్, బెంగళూరు జట్లు తలా ఎనిమిది విజయాలతో 16 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అత్యధిక రన్రేట్ ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. హైదరాబాద్ కంటే మెరుగైన రన్రేట్ ఉన్న బెంగళూరు ఐపీఎల్ చాంపియన్ అవుతుంది.