రాజసం తిరిగొచ్చేనా..!  | Rajasthan Royals expect second title | Sakshi
Sakshi News home page

రాజసం తిరిగొచ్చేనా..! 

Published Wed, Mar 20 2019 12:07 AM | Last Updated on Thu, Mar 21 2019 1:42 PM

Rajasthan Royals expect second title - Sakshi

ఐపీఎల్‌లోని ఎనిమిది జట్లలో ప్రతిభకు కొదవ లేకున్నా ‘స్టార్‌ అట్రాక్షన్‌’ తక్కువగా కనిపించే జట్టు రాజస్తాన్‌ రాయల్స్‌. భీకరమైన ఆటతో ఒకరితో మరొకరు పోటీపడుతూ రికార్డులు కొల్లగొట్టే ఆటగాళ్లు లేకపోయినా ప్రశాంతంగా ఫలితాలు రాబడుతూ వెళ్లిపోయింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతం తర్వాత రెండేళ్ల నిషేధానికి గురై గత ఏడాది పునరాగమనం చేసిన ఆ జట్టు స్మిత్‌లాంటి ఆటగాడూ దూరమైనా సరే... ఎలాంటి ఒత్తిడి దరి చేరనీయకుండా ప్లేఆఫ్స్‌ చేరుకోవడం దీనికి ఉదాహరణ. మొదటి నుంచి రాయల్స్‌తోనే కొనసాగుతున్న కొందరితో పాటు కొత్తగా పెద్ద సంఖ్యలో వచ్చిన యువ ఆటగాళ్లతో ఈ సారి రాజస్తాన్‌ ఎలాంటి సవాల్‌ విసురుతుందో చూడాలి.   

బలాలు: బట్లర్, స్టోక్స్‌ రూపంలో ఇద్దరు విధ్వంసకర విదేశీ బ్యాట్స్‌మెన్‌ ఆ జట్టులో ఉన్నారు. వీరికి ఇప్పుడు ఆసీస్‌ సంచలనం టర్నర్‌ కూడా జత కలిశాడు. ఇక తిరిగొస్తున్న స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్, అనుభవం, వ్యూహ నైపుణ్యం కూడా జట్టుకు అదనపు బలం కానున్నాయి. ఒషాన్‌ థామస్, లివింగ్‌స్టోన్‌ రూపంలో మరో ఇద్దరు ధాటిగా ఆడే బ్యాట్స్‌మెన్, జోఫ్రా ఆర్చర్‌లాంటి బౌలర్‌ ఉన్నా... నలుగురు ఆటగాళ్ల పరిమితి నేపథ్యంలో వీరిలో ఎవరికి ఎన్ని అవకాశాలు లభిస్తాయనేది ఆసక్తికరం. భారత ఆటగాళ్లలో కెప్టెన్‌ రహానే, శామ్సన్, మనన్‌ వోహ్రాలపై జట్టు బ్యాటింగ్‌ ఆధారపడి ఉంది. ఆసీస్, ఇంగ్లండ్‌ క్రికెటర్లు వరల్డ్‌ కప్‌ సన్నాహకాల నేపథ్యంలో ముందుగానే వెళ్లిపోయే అవకాశం ఉండటంతో ఆరంభ మ్యాచ్‌లలో వారిని సమర్థంగా వినియోగించుకుంటే తగినన్ని పాయింట్లు జట్టు ఖాతాలో చేరతాయి. చివర్లో మళ్లీ మన ఆటగాళ్లే జట్టును నడిపించాల్సి ఉంటుంది. లోయర్‌ ఆర్డర్‌లో కృష్ణప్ప గౌతమ్‌ దూకుడుగా ఆడగలడు. బౌలింగ్‌లో ఉనాద్కట్, శ్రేయస్‌ గోపాల్‌ కీలకం కానున్నారు. అయితే బౌలింగ్‌ వనరులతో పోలిస్తే బ్యాటింగ్‌పైనే ఆ జట్టు ఎక్కువగా ఆధార పడుతోంది. 

బలహీనతలు: భారత్‌కు చెందిన నిఖార్సయిన టి20 హిట్టర్‌ ఒక్కరు కూడా జట్టులో లేకపోవడం పెద్ద లోటు. టోర్నీలో మున్ముందు అదే సమస్యగా కనిపించవచ్చు. రహానేలో టెక్నిక్‌కు సమస్య లేకున్నా అతని శైలి అందరికీ తెలిసిందే. 2018లో 14 ఇన్నింగ్స్‌లలో కేవలం 370 పరుగులు... అదీ 118.21 స్ట్రయిక్‌ రేట్‌తో చేశాడంటేనే రహానే ప్రభావం గురించి చెప్పేయవచ్చు! గత ఏడాది బట్లర్‌ మినహా అంతా విఫలమయ్యారు. వీరిలో చాలా మంది ఈసారి కూడా జట్టులో ఉన్నారు. ఏడాది కాలంగా దాదాపు ఆటకు దూరంగా ఉండి కొద్దిపాటి మ్యాచ్‌ ప్రాక్టీస్‌తో ఐపీఎల్‌కు వస్తున్న స్మిత్‌ ఏమాత్రం ఆడతాడనేదానిపై కూడా జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇతర ఆటగాళ్లలో మహిపాల్‌ లోమ్రోర్, ప్రశాంత్‌ చోప్రా, రాహుల్‌ త్రిపాఠి, సుధేశన్‌ మిథున్, రియాన్‌ పరాగ్, శుభమ్‌ రంజనేలాంటి ఆటగాళ్లపై నమ్మకముంచడం కష్టం. బౌలింగ్‌లో భారీ మొత్తానికి తీసుకున్న ఉనాద్కట్‌ గత ఏడాదే (11 వికెట్లు) తీవ్రంగా నిరాశ పర్చాడు. ఈసారి కూడా అతనే ప్రధాన బౌలర్‌ కాగా, జోఫ్రా ఆర్చర్‌ ప్రభావం చూపించగలడు. ఎప్పుడో ప్రభ తగ్గిపోయిన వరుణ్‌ ఆరోన్, స్టువర్ట్‌ బిన్నీ, ధావల్‌ కులకర్ణిలకు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇది ఒక రకంగా ప్రతికూలమే.   

జట్టు వివరాలు:  రహానే (కెప్టెన్‌), సంజు శామ్సన్, రంజనే, బిన్నీ, శ్రేయస్‌ గోపాల్, మిథున్, ఉనాద్కట్, ప్రశాంత్‌ చోప్రా, మహిపాల్, రియాన్‌ పరాగ్, ధావల్‌ కులకర్ణి, కె.గౌతమ్, ఆరోన్, శశాంక్‌ సింగ్, మనన్‌ వోహ్రా, రాహుల్‌ త్రిపాఠి, ఆర్యమాన్‌ బిర్లా (భారత ఆటగాళ్లు), స్టోక్స్, టర్నర్, స్టీవ్‌ స్మిత్, ఇష్‌ సోధి, ఒషాన్‌ థామస్, జోఫ్రా ఆర్చర్, లివింగ్‌స్టోన్, బట్లర్‌ (విదేశీ ఆటగాళ్లు).  

►2008లో తొలిసారి జరిగిన ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ విజేతగా నిలిచింది. 2016, 2017లో లీగ్‌కు దూరమైన జట్టు గత ఏడాది నాలుగో స్థానంలో నిలిచింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement