
కోల్‌కతా: రంజీట్రోఫీ చరిత్రలో విదర్బ తొలిసారి ఫైనల్‌కు చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. కర్ణాటకతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో విదర్భ ఐదు పరుగుల తేడాతో విజయం నమోదు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. విదర్బ పేసర్ రజ్నీస్ గుర్బానీ ఏడు వికెట్లతో చెలరేగడంతో కర్ణాటక స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా విదర్బ జట్టు మొదటిసారి రంజీ ఫైనల్‌కు చేరి కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
కర్ణాటక తన రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో 192 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. చివరి రోజు విదర్బ విజయానికి మూడు వికెట్లు మాత్రమే అవసరమయ్యాయి. ఆ మూడు వికెట్లను గుర్బానీ తన ఖాతాలో వేసుకుని జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. కర్ణాటక ఆటగాళ్లలో కరుణ్ నాయర్(30), వినయ్ కుమార్(36), అభినవ్ మిథున్(33), రవికుమార్ సమరత్(24),సీఎం గౌతమ్(24), శ్రేయస్ గోపాల్(24)లు రెండంకెల స్కోరుకే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో గుర్బానీ మొత్తంగా 12 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటగా, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించాడు. ఇదిలా ఉంచితే, మరొక సెమీ ఫైనల్లో ఢిల్లీ ఇన్నింగ్స్ 26 పరుగుల తేడాతో బెంగాల్‌పై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. డిసెంబర్ 29వ తేదీన ఇండోర్‌లో విదర్బ-ఢిల్లీ జట్ల మధ్య టైటిల్ పోరు ఆరంభం కానుంది.
విదర్భ తొలి ఇన్నింగ్స్ 185 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 313 ఆలౌట్
కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 301 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 192 ఆలౌట్