జూడోలో రజ్వీందర్‌కు కాంస్యం | Rajwinder Kaur wins 4th bronze for India in the Commonwealth Games 2014 | Sakshi
Sakshi News home page

జూడోలో రజ్వీందర్‌కు కాంస్యం

Published Sun, Jul 27 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

కామన్వెల్త్ గేమ్స్ మూడో రోజున జూడోలో భారత్‌కు ఒక కాంస్యం దక్కింది. మహిళల 78+ విభాగం క్వార్టర్స్‌లో రజ్వీందర్ కౌర్.. రటుగీ (కెన్యా)ని ఓడించింది.

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ మూడో రోజున జూడోలో భారత్‌కు ఒక కాంస్యం దక్కింది. మహిళల 78+ విభాగం క్వార్టర్స్‌లో రజ్వీందర్ కౌర్.. రటుగీ (కెన్యా)ని ఓడించింది. అయితే 78 కేజీల విభాగం కాంస్య పతక పోరులో జీనా దేవి జోంగ్తమ్ 0-1 తేడాతో కామెరూన్‌కు చెందిన ఎంబల్లా చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 100కేజీ కాంస్య పతక పోరులో సాహిల్ పఠానియా 0-2 తేడాతో న్యూజిలాండ్‌కు చెందిన స్లైఫీల్డ్ చేతిలో ఓడిపోయాడు.
 
 స్క్వాష్‌లో దీపికాకు నిరాశ: భారత స్టార్ ప్లేయర్ దీపికా పల్లికల్‌కు ఈసారీ నిరాశే ఎదురైంది.  క్వార్టర్స్‌లో అలిసన్ వాటర్స్ (ఇంగ్లండ్) 3-1తో దీపికను ఓడించింది.  మరో క్రీడాకారిణి అలంకమోని 3-0తో ఎలీ వెబ్‌పై (పపువా న్యూగినియా)పై గెలిచి సెమీస్‌కు చేరింది.
 
  పరుషుల విభాగంలో సౌరవ్ ఘోశల్ కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ సౌరవ్ 3-2తో స్టీవెన్ ఫింటిస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గాడు. దీంతో 1998లో ఈ గేమ్స్ ప్రవేశపెట్టినప్పటి నుంచి క్వార్టర్స్‌కు చేరుకున్న తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. పురుషుల క్లాసిక్ ప్లేట్ ప్రిక్వార్టర్స్‌లో మహేశ్ మంగనోకర్ 3-0తో క్రీడ్ (వేల్స్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.
 
 టేబుల్ టెన్నిస్: టేబుల్ టెన్నిస్‌లో భారత పురుషుల జట్టు సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో 3-0తో స్కాట్లాండ్‌పై గెలిచింది. మహిళల జట్టు సెమీస్‌లో సింగపూర్ చేతిలో 1-3తో ఓడింది. ఇక కాంస్యం కోసం ఆసీస్‌తో తలపడుతుంది.
 
 లాన్‌బౌల్స్:  అంతగా అంచనాలు లేని లాన్‌బౌల్స్‌లో ఊహించిందే జరిగింది. మహిళల ఫోర్స్ సెక్షన్-బి రౌండ్ 5లో భారత జట్టు 12-13తో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడింది.
 
 ప్రి క్వార్టర్స్‌లో విజేందర్, మనోజ్: బాక్సింగ్‌లో భారత్ పంచ్ అదిరింది. స్టార్ బాక్సర్ విజేందర్‌సింగ్, మనోజ్ కుమార్‌లు తొలిరౌండ్‌ను అలవోకగా అధిగమించారు. పురుషుల 74 కేజీల విభాగం తొలి రౌండ్‌లో విజేందర్ 3-0తో ఆండ్రూ కొమెటా (కిరిబతి)ను మట్టికరిపించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 64 కేజీల విభాగం తొలి రౌండ్‌లో మనోజ్‌కుమార్ 3-0తో మోకహచనా మోషోషి (లీసోతో)పై సునాయాసంగా గెలిచాడు.  
 
 మీనా కుమారి నిరాశ: మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధిస్తుందనే అంచనాలున్న మీనా కుమారి నిరాశపరిచింది. 58 కేజీల విభాగంలో మీనా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. స్నాచ్‌లో 83 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు మాత్రమే ఎత్తగలిగింది.
 
 వయసు 60... పతకాలు 18
 ఇంగ్లండ్‌కు చెందిన షూటర్ మైకేల్ గల్ట్ 60 ఏళ్ల వయసులోనూ పతకాల పంట పండిస్తున్నాడు. శనివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో కాంస్యం సొంతం చేసుకున్న అతను కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యధిక పతకాల రికార్డు (18)ని సమం చేశాడు.
 
 ఢిల్లీ ఎందుకు రాలేదంటే...
 గ్లాస్గో: నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ లేకపోవడం పెద్ద లోటుగా అనిపించింది. దీనిపై ఇప్పుడు బోల్ట్ మాట్లాడాడు. ‘ఢిల్లీలో అక్టోబర్-నవంబర్‌లలో గేమ్స్ జరిగాయి. అప్పుడు సీజన్ ముగింపు దశలో ఉంది. మరి కొద్ది రోజుల్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నేను పోటీ పడాల్సి ఉంది. అందుకు సన్నాహకాల కోసమే ఢిల్లీ గేమ్స్ నుంచి తప్పుకున్నాను’ అని బోల్ట్ చెప్పాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement