
వాయనాడ్ (కేరళ): తొలిసారి రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో అడుగు పెట్టి మరో అడుగు ముందుకు వెళ్లాలనుకున్న కేరళ ఆశలు ఫలించలేదు. డిఫెండింగ్ చాంపియన్ విదర్భ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా రెండో రోజే మ్యాచ్‌ను ముగించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఉమేశ్ యాదవ్ (5/31) పేస్‌కు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కేరళ 91 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్, 11 పరుగుల తేడాతో విదర్భ ఘన విజయం సాధించింది. ఓపెనర్ అరుణ్ కార్తీక్ (36; 5 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఎనిమిది మంది ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. ఉమేశ్‌కు తోడుగా రజనీశ్ గుర్బాని 4 వికెట్లతో చెలరేగాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 171/5తో శుక్రవారం ఆట కొనసాగించిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటై 102 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కేరళ పేసర్ సందీప్ వారియర్‌కు 5 వికెట్లు దక్కాయి.
ఆధిక్యం ఎవరికో...
బెంగళూరు: కర్ణాటక, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆధిక్యం కోసం ఇరు జట్లు పోరాడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసేసరికి సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. స్నెల్ పటేల్ (85; 15 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... షెల్డన్ జాక్సన్ (46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), పుజారా (45; 3 ఫోర్లు, సిక్స్) ఫర్వాలేదనిపించారు. రోనిత్ మోరె 5 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 264/9తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక మరో తొమ్మిది పరుగులు జోడించి 275 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం చేతిలో 3 వికెట్లు ఉన్న సౌరాష్ట్ర మరో 48 పరుగులు వెనుకబడి ఉంది. సీనియర్ బ్యాట్స్‌మన్ అర్పిత్ (26 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆధిక్యం ఎవరికి లభిస్తుందనేది ఆసక్తికరం.
Comments
Please login to add a commentAdd a comment