![Ranji Trophy:andhra team loss the match - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/18/Untitled-5.jpg.webp?itok=ZdJMuG5z)
నదౌన్: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు హిమాచల్ ప్రదేశ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. ఇన్నింగ్స్ 3 పరుగుల తేడాతో ఓడింది. ఓపెనర్ సీఆర్ జ్ఞానేశ్వర్ (103; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించినప్పటికీ జట్టును గట్టెక్కించలేకపోయాడు. ఓవర్‌నైట్ స్కోరు 175/1తో సోమ వారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర 100.5 ఓవర్లలో 284 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆట మొదలైన కాసేపటికే... సెంచరీ పూర్తయిన వెంటనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ జ్ఞానేశ్వర్ నిష్క్రమించడంతో మిగతా బ్యాట్స్‌మెన్ వరుస విరామాల్లో వికెట్లను సమర్పించుకున్నారు.
సాయికృష్ణ (82 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరి మితమయ్యారు. హిమాచల్ బౌలర్లలో గుర్విందర్ సింగ్ (3/62), మయాంక్ డాగర్ (3/89) ఆంధ్రను దెబ్బ మీద దెబ్బ తీశారు. గులేరియాకు 2 వికెట్లు దక్కాయి. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే కుప్పకూలగా, హిమాచల్ తొలి ఇన్నింగ్స్‌లో 460 పరుగుల భారీస్కోరు చేసి ఆలౌటైంది. ఈ గ్రూపులో ఐదు మ్యాచ్‌లాడి ఒక్కటీ గెలవలేకపోయిన ఆంధ్రకు ఇది రెండో ఓటమి కాగా, 3 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ప్రస్తుతం గ్రూప్ ‘బి’లో ఆంధ్ర అట్టడుగున ఉంది.
Comments
Please login to add a commentAdd a comment