ఇద్దరు మనోళ్లే!
భరత్ అరుణ్... రామకృష్ణన్ శ్రీధర్... భారత్‌కు అండర్-19 ప్రపంచకప్‌ను గెలిపించిన కోచ్‌లు. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ జోడీని సీనియర్ జట్టుకు అండగా నిలిచేందుకు బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ ఇద్దరికీ యాదృచ్ఛికంగా తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. కెరీర్ ఆసాంతం తమిళనాడుకే ఆడినా... అరుణ్ పుట్టింది విజయవాడలో. అలాగే మైసూర్‌లో పుట్టినా... శ్రీధర్ తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మొత్తం హైదరాబాద్ తరఫునే ఆడి ప్రస్తుతం ఆంధ్ర జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యాడు. 2012లో అండర్-19 ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టుకు అరుణ్ చీఫ్ కోచ్ కాగా, శ్రీధర్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. - సాక్షి క్రీడావిభాగం
ఆర్. శ్రీధర్
లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన 44 ఏళ్ల ఆర్. శ్రీధర్ హైదరాబాద్ తరఫున దాదాపు 12 ఏళ్ల కెరీర్‌లో 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 91 వికెట్లు పడగొట్టాడు. 15 లిస్ట్ ‘ఎ’ మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు. ఆటగాడిగా ఉన్న సమయంలో దేశవాళీలో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2001నుంచే కోచింగ్ వైపు మళ్లి, సుదీర్ఘ కాలం పాటు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) కోచ్‌లలో ఒకడిగా శ్రీధర్ పని చేశాడు.
2012లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన అతను, ఈ ఏడాది కూడా అదే బాధ్యత నిర్వర్తించాడు. ఐపీఎల్-7లో పంజాబ్ ఫీల్డింగ్ కోచ్‌గా పని చేసిన తర్వాత శ్రీధర్‌కు ఒక్కసారిగా ప్రత్యేక గుర్తింపు దక్కింది. అనంతరం ఈ సీజన్ కోసం ఆంధ్ర జట్టు కోచ్‌గా కూడా ఎంపిక చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో తొలిసారి భారత సీనియర్ జట్టుతో కలిసి పని చేసే అవకాశం లభించింది.
భరత్ అరుణ్
పేస్ బౌలర్ అయిన అరుణ్ 1979లో రవిశాస్త్రి కెప్టెన్సీలో శ్రీలంకలో పర్యటించిన అండర్-19 జట్టు సభ్యుడిగా తొలిసారి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1986-87లో భారత్ తరఫున కేవలం 2 టెస్టులు ఆడిన అతను 4 వికెట్లు తీశాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 48 మ్యాచ్‌ల్లో 110 వికెట్లు పడగొట్టాడు. లోయర్ ఆర్డర్‌లో మంచి బ్యాట్స్‌మన్‌గా కూడా గుర్తింపు ఉన్న అరుణ్ 1987-88లో రంజీ ట్రోఫీ గెలిచిన తమిళనాడు జట్టులో సభ్యుడు.
ఆ తర్వాత దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో సౌత్‌జోన్ తరఫున సెంచరీ (149) చేయడంతో పాటు డబ్ల్యూవీ రామన్‌తో కలిసి 221 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడం అతని కెరీర్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన. 2008నుంచి ఇటీవలి వరకు ఎన్‌సీఏలో కోచ్‌గా ఉన్న అరుణ్... ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ అకాడమీ కోచింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2012లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు కోచ్‌గా ఉన్న అతను ఈ ఏడాది కూడా టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు.