రాజపుత్రుడి అశ్విక దళం! | Ravindra Jadeja is a cricketer with different tastes | Sakshi
Sakshi News home page

రాజపుత్రుడి అశ్విక దళం!

Published Thu, May 1 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM

రాజపుత్రుడి అశ్విక దళం!

రాజపుత్రుడి అశ్విక దళం!

గుర్రాలపై రవీంద్ర జడేజా మోజు
 క్రికెటర్లలో భిన్నమైన సరదా
 
 రాజ్‌కోట్:  పిచ్చి పలు రకాలు...ఇక సెలబ్రిటీల విషయంలో ఇది కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ఆటపరంగా ఎంతో ప్రొఫెషనలిజం కనబరిచే క్రికెటర్లు సొంత ఇంటికి వచ్చే సరికి మాత్రం భిన్నంగా మారిపోతారు. సరదాలు తీర్చుకుంటూ తమదైన ప్రపంచంలో ఎంజాయ్ చేస్తారు. భారత క్రికెటర్లలో రవీంద్ర సింహ్ జడేజాది కూడా ఇదే శైలి. రాజ్యాలు పోయినా...రాజులు పోయినా రాజపుత్ర వంశం అనే తోక మాత్రం జడేజాకు మిగిలిపోయింది. అప్పటి ప్రభావం అతనిపై ఇంకా మిగిలే ఉన్నట్లుంది...అందుకే జడేజాకు గుర్రాలంటే అమిత ఇష్టం. ఎప్పుడు విరామం దొరికినా తన స్వస్థలం జామ్‌నగర్‌కు వెళ్లిపోయి గుర్రాలపై స్వారీ చేస్తాడు. వాటితో ఆడుకోవడమే అతనికి పెద్ద సరదా.
 
 లక్కీ నంబర్ 8
 ప్రస్తుతం జడేజా వద్ద నాలుగు మేలు జాతి అశ్వాలు ఉన్నాయి. ధన్‌రాజ్, గంగ, కేసర్, జానకి అని వాటికి అతను పేర్లు పెట్టాడు. మూడేళ్ల క్రితం అతను జామ్‌నగర్ శివార్లలో ఎనిమిది ఎకరాల స్థలం కొని అక్కడ ఫామ్‌హౌస్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే తన గుర్రపు శాల కూడా సిద్ధం చేశాడు. వాటిని పోషించేందుకు ప్రత్యేక ట్రైనర్‌ను నియమించిన జడేజా...మ్యాచ్‌లు లేని సమయంలో ఆ గుర్రాలతోనే టైమ్‌పాస్ చేస్తాడు. వాటిపై స్వారీ చేస్తూ సమీప ప్రాంతాలన్నీ అతను చుట్టి వస్తుంటాడు. అదే ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రంలోనే గుర్రాలకు కావాల్సిన ఆహారపు పెంపకం కూడా జరుగుతుంది. ‘ఇప్పుడు నా వద్ద నాలుగు గుర్రాలు ఉన్నాయి. కానీ నా అదృష్ట సంఖ్య ఎనిమిది.
 
  కాబట్టి కనీసం మరో 4 గుర్రాలు కొనాల్సి ఉంది’ అని జడేజా అన్నాడు. క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఆరంభంలో అతను పెద్ద సంఖ్యలో పావురాళ్లు, కుందేళ్లు, కుక్కలు, విభిన్న రకాల చేపలు ఇంటికి తెచ్చేవాడు. చిన్నప్పటినుంచే పక్షులు, జంతువులను పెంచుకునేవారా అని అడిగితే...‘అప్పుడు మా తిండికే దిక్కు లేదు. ఇక వీటిని ఎక్కడ పోషిస్తాను’ అని తన పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటాడు ఈ ఆల్‌రౌండర్.
 
 చెబితే వింటేగా...
 ‘గుర్రాలకంటే బైక్‌లు ఎంతో మెరుగని ఎన్నో సార్లు అతనికి చెప్పాను. బైక్‌లను ఒక్కసారిగా గ్యారేజీలో పడేసి అవసరమున్నప్పుడు పెట్రోల్ పోసి బైటికి తీయవచ్చు. అదే గుర్రాలైతే రోజూ మేపాలి. నాలుగు గుర్రాలకు జడేజా పెట్టిన డబ్బుతో నేను నాలుగు బైక్‌లు కొంటాను. కానీ ఎంత చెప్పినా అతను అర్థం చేసుకోడు’      
 - ఎంఎస్ ధోని, భారత కెప్టెన్
 
 ప్రియ నేస్తాలు...
 ఎప్పుడు అవకాశం దొరికినా గుర్రాలపై తన ప్రేమను ప్రదర్శించేందుకు జడేజా వెనుకాడడు. ‘గుర్రాలు దగ్గరగా ఉంటే దెయ్యాలులాంటివి కూడా దరి చేరవని నేను చదివాను. వాటి లక్షణాలను బట్టి నేను అవి ఏ జాతివో గుర్తించగలను. అన్నట్లు...కేసర్ చతేశ్వర్ పుజారాలాంటిది. చాలా పని చేస్తుంది కానీ సెలైంట్‌గా ఉంటుంది’ అని జడేజా నవ్వేస్తాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement