తప్పక చూడండి | rio olympics special story for athlets | Sakshi
Sakshi News home page

తప్పక చూడండి

Published Sat, Aug 6 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

తప్పక చూడండి

తప్పక చూడండి

బోల్ట్ పరిగెడుతుంటే... టీవీల ముందు కూర్చున్న మనం ఊపిరి బిగబడతాం..! ఒలింపిక్స్ అంటే ఇలాంటి ఎన్నో గొప్ప విన్యాసాల కలయిక. ప్రతి ఒలింపిక్స్‌లోనూ కచ్చితంగా కొంతమంది ఈవెంట్స్‌ని చూసి తీరాలి.

బోల్ట్ పరిగెడుతుంటే... టీవీల ముందు కూర్చున్న మనం ఊపిరి బిగబడతాం..!
ఫెల్ప్స్ ఈత కొలనులో చేపలా దూసుకుపోతుంటే సంబరపడతాం..!
లిన్ డాన్ స్మాష్‌లు, సెరెనా ఏస్‌లకు మంత్ర ముగ్ధులమై పోతుంటాం..!

 ఒలింపిక్స్ అంటే ఇలాంటి ఎన్నో గొప్ప విన్యాసాల కలయిక. ప్రతి ఒలింపిక్స్‌లోనూ కచ్చితంగా కొంతమంది ఈవెంట్స్‌ని చూసి తీరాలి. లేకపోతే క్రీడాభిమానికి ఆ వెలితి నాలుగేళ్ల పాటు ఉంటుంది. ఈసారి రియోలో తమ ప్రదర్శనలతో సంచలనాలు సృష్టిస్తారని భావిస్తున్న దిగ్గజాలు చాలామందే ఉన్నారు. కచ్చితంగా వీరి ఆటను మాత్రం చూసి తీరాల్సిందే.

 ఉసేన్ బోల్ట్ (అథ్లెటిక్స్)
పురుషుల 100 మీటర్లు (ఆగస్టు 15న ఫైనల్- ఉ. గం. 6.55 ని.కు),  200 మీటర్లు
(19న ఫైనల్-ఉ.గం. 7.00కు), 4్ఠ100 మీటర్ల రిలే (20న -ఫైనల్ ఉ.గం. 7.05 ని.కు).

 అంతా అనుకున్నట్లు జరిగితే ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఒలింపిక్స్ చరిత్రలో ఏ అథ్లెట్ కూడా పురుషుల 100 మీటర్ల విభాగంలో వరుసగా మూడు లేదా ఓవరాల్‌గా మూడు స్వర్ణాలు నెగ్గిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఫామ్, గత రికార్డులను పరిశీలిస్తే...  6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 94 కేజీల బరువున్న బోల్ట్ స్వీయ తప్పిదం చేస్తే తప్ప అతణ్ని ఓడించే వారు రియోలో కనిపించడంలేదు. జస్టిన్ గాట్లిన్ (అమెరికా), యోహాన్ బ్లేక్ (జమైకా) నుంచి బోల్ట్‌కు పోటీ లభించే అవకాశమున్నా... ఇప్పటివరకైతే మెగా ఈవెంట్స్‌లో ఈ జమైకా స్టార్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రికార్డు ఉంది. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లలో మాదిరిగా రియోలో 100 మీటర్లతోపాటు 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలోనూ బోల్ట్ స్వర్ణాలు నెగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా జరిగితే వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో ‘ట్రిపుల్ గోల్డ్’ సాధించిన ఏకైక అథ్లెట్‌గా బోల్ట్ నిలుస్తాడు.

యాష్టన్ ఈటన్ (అథ్లెటిక్స్)
పురుషుల డెకాథ్లాన్ (ఆగస్టు 17 నుంచి 19 వరకు)

ఒకట్రెండు ఈవెంట్స్‌లో పోటీపడాలంటేనే ఎంతో శ్రమించాలి. అలాంటిది పది అంశాల సమాహారమైన డెకాథ్లాన్‌లో (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) నిలకడగా రాణించి స్వర్ణం సాధించడమంటే మాటలు కాదు. అమెరికాకు చెందిన 28 ఏళ్ల యాష్టన్ ఈటన్ వరుసగా రెండో ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యంగా రియోలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 1912 నుంచి ఇప్పటివరకు ఒలింపిక్స్ చరిత్రలో బాబ్ మథియాస్ (అమెరికా-1948, 1952), డేలీ థాంప్సన్ (బ్రిటన్-1980, 1984) మాత్రమే డెకాథ్లాన్‌లో రెండుసార్లు స్వర్ణాలు సాధించారు. 2013, 2015 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన ఈటన్... ఓవరాల్‌గా 9000 పాయింట్లకుపైగా స్కోరు చేసిన రెండో డెకాథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. గతేడాది 9045 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈటన్ రియోలోనూ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.

కింబర్లీ రోడ్ (షూటింగ్)
మహిళల స్కీట్ (ఆగస్టు 12న-క్వాలిఫికేషన్స్, సెమీఫైనల్స్ సా.గం. 5.30 నుంచి రా.గం. 11.30 వరకు),
13న ఫైనల్స్ (రాత్రి గం. 12.00 నుంచి 12.30 వరకు).

 ఒక్కసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటేనే తమ కెరీర్‌కు సార్థకత లభించిందని భావించే క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారు. కింబర్లీ రోడ్ మాత్రం వరుసగా ఆరో ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 37 ఏళ్ల ఈ అమెరికా మహిళా షూటర్ ఈసారీ పతకం సాధిస్తే వరుసగా ఆరు ఒలింపిక్స్‌లలో పతకం నెగ్గిన తొలి మహిళా క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. పురుషుల విభాగంలో మాత్రం ఇటలీకి చెందిన అర్మీన్ జోగ్‌జెలెర్ (వింటర్ ఒలింపిక్స్; ల్యూజ్ ఈవెంట్) మాత్రమే ఈ ఘనత సాధించాడు. 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న కింబర్లీ రోడ్ 17 ఏళ్ల  ప్రాయంలో తొలిసారి 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్‌లో పోటీ పడి స్వర్ణం సాధించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ‘డబుల్ ట్రాప్’లో కాంస్యం, 2004 ఏథెన్స్‌లో ‘డబుల్ ట్రాప్’లో స్వర్ణం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ‘స్కీట్’ ఈవెంట్‌లో రజతం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో ‘స్కీట్’ ఈవెంట్‌లో స్వర్ణం సొంతం చేసుకుంది. మరి రియో ఒలింపిక్స్‌లో రోడ్ ‘గన్’ గురికి పతకం రాలుతుందో లేదా వేచి చూడాలి.

లిన్ డాన్ (బ్యాడ్మింటన్)
పురుషుల సింగిల్స్ (ఆగస్టు 11 నుంచి 20 వరకు)

బ్యాడ్మింటన్ క్రీడలో ‘ఆల్‌టైమ్ గ్రేట్’గా పేరొందిన చైనా సూపర్ స్టార్ లిన్ డాన్ ‘హ్యాట్రిక్’ లక్ష్యంతో రియోలో అడుగుపెట్టాడు. 32 ఏళ్ల ఈ చైనా ప్లేయర్ 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో స్వర్ణాలు సాధించాడు. బ్యాడ్మింటన్‌లో ‘సూపర్ గ్రాండ్‌స్లామ్’ (తొమ్మిది ప్రముఖ టైటిల్స్ సాధించడం: ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, థామస్ కప్, సుదిర్మన్ కప్, వరల్డ్ కప్, సూపర్ సిరీస్ మాస్టర్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్) ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌గా గుర్తింపు పొందిన లిన్ డాన్‌కు మలేసియా స్టార్ లీ చోంగ్ వీ, తన దేశానికే చెందిన చెన్ లాంగ్ నుంచి గట్టిపోటీ లభించే అవకాశముంది. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 70 కేజీల బరువున్న లిన్ డాన్‌కు మెగా ఈవెంట్స్‌లో అద్వితీయ ఆటతీరుతో అదరగొట్టే అలవాటుంది. రియోలోనూ అదే దూకుడు కొనసాగించి అరుదైన ‘హ్యాట్రిక్’ సాధించి లిన్ డాన్ మరో మైలురాయి చేరుకుంటాడో లేదో చూడాలి.

సవోరి యోషిదా (రెజ్లింగ్)
మహిళల ఫ్రీస్టయిల్ 53 కేజీల విభాగం (క్వాలిఫయింగ్,
ఫైనల్స్ ఆగస్టు 18న సాయంత్రం గం. 6.30 నుంచి రాత్రి 1.30 వరకు)

కవోరి ఇచో (రెజ్లింగ్)
మహిళల ఫ్రీస్టయిల్ 58 కేజీల విభాగం (క్వాలిఫయింగ్,
ఫైనల్స్ ఆగస్టు 17న సాయంత్రం గం. 6.30 నుంచి రాత్రి 2.20 వరకు)

గతంలో ఏ మహిళా క్రీడాకారిణికి సాధ్యంకాని రికార్డును సాధించేందుకు జపాన్ రెజ్లర్లు సవోరి యోషిదా, కవోరి ఇచో ‘రియో’ రంగంలోకి దిగనున్నారు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్ తొలిసారి ప్రవేశపెట్టినప్పటి నుంచి యోషిదా (55 కేజీలు)... కవోరి ఇచో (63 కేజీలు) వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించారు. 2013లో ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ఒలింపిక్ వెయిట్ కేటగిరిలో మార్పులు చేయడంతో ఈసారి రియోలో యోషిదా 53 కేజీల విభాగంలో, కవోరి ఇచో 58 కేజీల విభాగంలో పోటీపడనున్నారు. 33 ఏళ్ల యోషిదా తన కెరీర్‌లో కేవలం రెండు బౌట్‌లలో మాత్రమే ఓడిపోయింది. వరుసగా 13 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2002 నుంచి 2015 వరకు) స్వర్ణాలు నెగ్గి రెజ్లింగ్ చరిత్రలోనే ఎవరీకి సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకున్న యోషిదా వరుసగా నాలుగు ఆసియా క్రీడల్లోనూ (2002 నుంచి 2014 వరకు) పసిడి పతకాలు సాధించడం విశేషం. మరోవైపు 32 ఏళ్ల కవోరి ఇచో 10 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు సాధించింది.

 ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో వ్యక్తిగత క్రీడాంశంలో ఇద్దరు మాత్రమే (అల్ ఒయెర్టర్ (డిస్కస్ త్రో) అమెరికా; 1956, 1960, 1964, 1968...  కార్ల్ లూయిస్ (లాంగ్‌జంప్) అమెరికా; 1984, 1988, 1992, 1996) వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించారు. ఈసారీ యోషిదా, కవోరి ఇచో స్వర్ణాలు నెగ్గితే కొత్త చరిత్ర సృష్టిస్తారు.

ఒక్సానా చుసోవితినా (జిమ్నాస్టిక్స్)
మహిళల వ్యక్తిగత ఆల్‌రౌండ్, వాల్ట్, ఫ్లోర్, బ్యాలెన్సింగ్ బీమ్,
అన్‌ఈవెన్ బార్స్ (ఆగస్టు 7న క్వాలిఫయింగ్, 14న వాల్ట్ ఫైనల్)

కెరీర్‌కు వీడ్కోలు పలికి కోచ్‌గా లేదా కుటుంబ బాధ్యతల్లో స్థిరపడే వయస్సులోనూ పతకం కోసం బరిలోకి దిగుతున్న జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవితినా. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన 41 ఏళ్ల ఒక్సానా గత ఏడేళ్లుగా జర్మనీ తరఫున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటోంది. రియో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న క్రీడాకారుల్లో పెద్ద వయస్కురాలు ఒక్సానాయే కావడం విశేషం. ఒక్సానాకిది వరుసగా ఏడో ఒలింపిక్స్. ఇప్పటి వరకు ఏ జిమ్నాస్ట్ కూడా ఏడు ఒలింపిక్స్‌లలో పాల్గొనలేదు. 1991కు ముందు సోవియెట్ యూనియన్ తరఫున పాల్గొన్న ఒక్సానా 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో యూనిఫైడ్ (విచ్ఛిన సోవియట్ యూనియన్ దేశాలతో కూడిన జట్టు) టీమ్ తరఫున ఆడి టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. తన మూడేళ్ల కుమారుడు అలీషెర్‌కు బ్లడ్ క్యాన్సర్ రావడంతో ఒక్సానా కుటుంబం చికిత్స కోసం జర్మనీకి మకాం మార్చి అక్కడే స్థిరపడింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో జర్మనీ తరఫున ఒక్సానా వాల్ట్ ఈవెంట్‌లో రజతం సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఐదో స్థానంలో నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో ఐదు వ్యక్తిగత ఈవెంట్స్‌లో పాల్గొంటున్నా... ఆమె తన ఫేవరెట్ ఈవెంట్ వాల్ట్‌లోనే పతకంపై గురి పెట్టింది. ఈ ఏడాది వాల్ట్ స్కోరింగ్‌లో ఒక్సానా మూడో స్థానంలో (15.325 పాయింట్లు) ఉండటం విశేషం.

మైకేల్ ఫెల్ప్స్ (స్విమ్మింగ్)
పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ (ఆగస్టు 10న ఫైనల్-ఉ.గం. 6.48 ని.కు),
200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే (ఆగస్టు 12న ఫైనల్-ఉ.గం. 7.31 ని.కు),
100 మీటర్ల బటర్‌ఫ్లయ్ (ఆగస్టు 13న ఫైనల్-ఉ.గం. 6.42 ని.కు).

‘ఈత కొలనులో బంగారు చేప’ మైకేల్ ఫెల్ప్స్ తన రిటైర్మెంట్‌ను  ఉపసంహరించుకొని మరీ ‘రియో’లో అడుగుపెట్టాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో 15 ఏళ్ల ప్రాయంలోనే బరిలోకి దిగిన ఫెల్ప్స్ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్‌లో పోటీపడి ఫైనల్‌కు చేరుకొని ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సిడ్నీ నుంచి రిక్తహస్తాలతో తిరిగొచ్చిన తర్వాత  31 ఏళ్ల ఈ అమెరికా స్టార్ స్విమ్మర్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలోనే అత్యధికంగా 22 పతకాలు (18 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు) సాధించిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 88  కేజీల బరువున్న ఫెల్ప్స్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో 6 స్వర్ణాలు, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించాడు. రియోలో మాత్రం ఫెల్ప్స్ మూడు ఈవెంట్స్‌లోనే బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఫెల్ప్స్ రియోలోనూ పసిడి పతకాలపై గురి పెట్టాడు.

షూటింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
క్వాలిఫయింగ్: అయోనికా పాల్, అపూర్వీ చండీలా (సాయంత్రం గం. 5.00 నుంచి)

ఫైనల్: రాత్రి గం. 7.00 నుంచి
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్

క్వాలిఫయింగ్: జీతూ రాయ్, గుర్‌ప్రీత్ సింగ్ (రాత్రి గం. 9.30 నుంచి) ఫైనల్: రాత్రి గం. 12.00 నుంచి
ఇటీవల కాలంలో జీతూ రాయ్ నిలకడైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే అతను పతకం తెస్తాడని ఆశించవచ్చు. మహిళా షూటర్లు అపూర్వీ, అయోనికా పాల్ ఫైనల్‌కు చేరితే మాత్రం ఒకరి నుంచి పతకం వచ్చే అవకాశముంది.

 రోయింగ్
పురుషుల సింగిల్ స్కల్స్ (హీట్-1) దత్తూ బబన్ భోకనాల్ (సాయంత్రం. గం. 5.00కు)

ఏడు నిమిషాల్లోపు రేసును పూర్తి చేస్తే ఈ భారత రోయర్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకునే అవకాశముంది. మొత్తం ఆరు హీట్స్ నుంచి 18 మంది క్వార్టర్ ఫైనల్ చేరుకుంటారు.

 పురుషుల హాకీ
భారత్ ఁ ఐర్లాండ్ (గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్) రాత్రి గం. 7.30 నుంచి

తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతోన్న ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయకుండా భారత్ ఆడాలి. మ్యాచ్‌పై దృష్టి సారించేందుకు భారత హాకీ జట్టు ప్రారంభోత్సవానికి దూరంగా ఉంది.

 పురుషుల టెన్నిస్ డబుల్స్ తొలి రౌండ్
లియాండర్ పేస్-రోహన్ బోపన్న ఁ లుకాస్ కుబోట్-మట్కోవ్‌స్కీ (పోలాండ్) రాత్రి గం. 7.30 నుంచి
డబుల్స్‌లో అపార అనుభవజ్ఞులైన పేస్-బోపన్న తమ స్థాయికి తగ్గట్టు పూర్తి సమన్వయంతో ఆడితేనే విజయాన్ని దక్కించుకుంటారు. ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో కుబోట్ 25వ, మట్కోవ్‌స్కీ 27వ ర్యాంక్‌లో ఉన్నారు. వీరిని తక్కువ అంచనా వేస్తే  తొలి రౌండ్‌లోనే షాక్ తగలొచ్చు.
అన్ని సమయాలు భారత కాలమానం ప్రకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement