
న్యూఢిల్లీ: వెటరన్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు, యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌లు ప్రపంచకప్ కోసం స్టాండ్‌బైగా ఎంపికయ్యారు. ముగ్గురు బ్యాకప్ ఆటగాళ్లలో వీరితో పాటు పేసర్ నవదీప్ సైనీకి అవకాశం దక్కింది. ఇది వరకే ఎంపిక చేసిన భారత జట్టులో ఎవరైనా గాయపడితే ఈ ముగ్గురు ఇంగ్లండ్ విమానం ఎక్కుతారు. బ్యాట్స్‌మెన్ గాయపడితే మొదట ప్రాధాన్యం పంత్‌కు లభిస్తుంది. రెండో అవకాశం రాయుడికిచ్చారు. బౌలర్ గాయపడితే మాత్రం సైనీ ఇంగ్లండ్‌కు బయల్దేరతాడు. అక్కడున్న అవసరాన్ని బట్టి ఈ ముగ్గురిలో ఒక్కొక్కరు వెళ్లే చాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే నెట్ ప్రాక్టీస్ కోసం బౌలర్లు ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, దీపక్ చహర్ జట్టుతో పాటే పయనమవుతారని బోర్డు తెలిపింది. ప్రపంచకప్‌కు ఎంపికై ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న క్రికెటర్లకు యో–యో టెస్టు నిర్వహించడం లేదని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న రాయుడిని టీమిండియాకు ఎంపిక చేయకపోవడం పలువురు మాజీలను విస్మయపరిచింది. ఆసీస్, కివీస్ పర్యటనల్లో రాణించిన తెలుగుతేజాన్ని పక్కనబెట్టడంపై విమర్శలొచ్చాయి. దీంతో బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ బుధవారం ఈ ముగ్గురిని స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. మెగా ఈవెంట్ బెర్త్ ఆశించి తీవ్ర నిరాశకు గురైన రాయుడికి ఇది కాస్త ఊరటనే చెప్పాలి. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతున్న ఈ హైదరాబాదీ ఈ ఉత్సాహంతో ఐపీఎల్‌లో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు.
రాయుడిపై చర్య తీసుకోం: బోర్డు
భారత జట్టు ఎంపికపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన రాయుడిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టబోమని బీసీసీఐ తెలిపింది. ‘అతని ట్వీట్‌ను గమనించాం. ప్రస్తుతం నిరాశలో భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలవి. దీనిపై చర్యలు తీసుకోం. పైగా అతను స్టాండ్‌బై జాబితాలో ఉన్నాడు’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. విజయ్ శంకర్ ఎంపికపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇస్తూ మూడు రకాల (3 డైమెన్షనల్ క్వాలిటీస్) ఉపయోగాలున్నందు వల్లే అతన్ని తీసుకున్నామని చెప్పారు. దీనిపై వెంటనే రాయుడు ప్రపంచకప్‌ను చూసేందుకు త్రీడి గ్లాస్‌లు (కళ్లద్దాలు) ఆర్డరిచ్చానని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.