
రిషభ్ పంత్
Rishabh Pant- T20 Cricket: టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో రానున్న పదేళ్లలో భారత జట్టులో అతడు కీలక ఆటగాడిగా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. టాపార్డర్‌లో పంత్‌ను ఆడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా అతడి సొంతమని వ్యాఖ్యానించాడు.
డీకే రాకతో పక్కకు పంత్!
కాగా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ పునరాగమనం నేపథ్యంలో ఇటీవలి కాలంలో ముఖ్యంగా ప్రపంచకప్-2022 టోర్నీలో పంత్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. అనువజ్ఞుడైన డీకే వైపు మొగ్గు చూపిన యాజమాన్యం పంత్‌ను కాదని అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది.
కేవలం తొమ్మిది పరుగులే
ఈ క్రమంలో ఐసీసీ ఈవెంట్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో మూడు పరుగులు, ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో పంత్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీ20 జట్టుకు పంత్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్ల గైర్హాజరీ నేపథ్యంలో యువ జట్టు కివీస్‌తో పోటీ పడనుంది.
రానున్న పదేళ్లలో అతడిదే హవా!
ఈ నేపథ్యంలో స్పోర్ట్స్‌కీడాతో ముచ్చటించిన రాబిన్ ఊతప్ప టీ20లలో పంత్ భవిష్యత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రిషభ్ పంత్ ఓపెనర్‌గా రావాలి. పంత్ టాపార్డర్‌లోనే మెరుగ్గా రాణించగలడు.
టీ20 క్రికెట్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలడు. తను మ్యాచ్ విన్నర్. గేమ్ చేంజర్. ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించగల సత్తా ఉన్నవాడు. రానున్న పదేళ్లలో భారత టీ20 జట్టులో అతడు అత్యంత కీలక ప్లేయర్‌గా ఎదుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఎడతెరిపి లేని వర్షం కారణంగా భారత్- న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దైంది.
చదవండి: Naseem Shah: అన్న అడుగు పడింది.. ఇప్పుడు తమ్ముడి వంతు
ఐపీఎల్‌లో కప్ సాధిస్తే.. టీమిండియా కెప్టెన్ చేయాలా? ఇదెక్కడి రూల్! అలా అయితే..