బెంగళూరు కథ కంచికే! | Rising Pune Supergiant thrashes Royal Challengers | Sakshi
Sakshi News home page

బెంగళూరు కథ కంచికే!

Published Sun, Apr 30 2017 2:13 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

బెంగళూరు కథ కంచికే!

బెంగళూరు కథ కంచికే!

► ఏడో ఓటమితో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి
► 61 పరుగులతో రైజింగ్ పూణే గెలుపు
► తాహిర్ ,ఫెర్గూసన్ సూపర్ బౌలింగ్

జట్టులో చెప్పుకుంటూ పోతే హిట్టర్లే... కానీ ప్రత్యర్థితో ఆడుకుంటూ వెళితే పరాజయాలే అన్న చందంగా తయారైంది బెంగళూరు జట్టు పరిస్థితి. తీరు మారని విరాట్‌ సేన మరో పరాజయంతో ‘ప్లే ఆఫ్‌’కు దాదాపు దూరమైంది.

ఆశల్లేవ్‌... అవకాశాల్లేవ్‌...
మేం ప్లే–ఆఫ్‌ రేసులో లేం. ఇక మా దారులు మూసుకుపోయాయి. మా ఆటతీరు ఎంత ఘోరంగా ఉందో అందరూ చూశారు. ఇలాంటి చెత్త ప్రదర్శన కనబరిచాక ఇంకేం మాట్లాడతాను. ఇది స్వయంకృతాపరాధం. దీనికి సాకులు వెతకను. కానీ ఇది పెద్ద గుణపాఠమని మా వాళ్లందరికి చెబుతున్నా. ఇక మిగిలిన మ్యాచుల్ని ఆస్వాదించేందుకే ఆడతాం. –కోహ్లి, బెంగళూరు కెప్టెన్‌  

పుణే: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మళ్లీ ఓడింది. లక్ష్యం కష్టసాధ్యం కాకపోయినా... ఒంటిచేత్తో గెలిపించే బ్యాట్స్‌మెన్‌ ఉన్నా... నిర్లక్ష్యం నిండా ఆవహిస్తే... ఆట ఆదమరిస్తే... పరాజయాలు మావెంటే! అన్నట్లు సాగింది బెంగళూరు ఇన్నింగ్స్‌. శనివారం రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి చవిచూసింది.

ఏడో పరాజయంతో ఐపీఎల్‌–10లో అందరికంటే ముందుగా నిష్క్రమించేందుకు అడుగులేస్తోంది. మొదట పుణే 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్టు కోల్పోయి 96 పరుగులే చేయగల్గింది.  నాలుగు ఓవర్లలో ఒక మెయిడిన్‌ తీసుకొని కేవలం ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన పుణే జట్ట పేస్‌ బౌలర్‌ ఫెర్గూసన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఆకట్టుకున్న స్మిత్, తివారి...
టాస్‌ నెగ్గిన బెంగళూరు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పుణేకు ఓపెనర్‌ రహానే (6) రూపంలో తొలిదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద అతను బద్రీ బౌలింగ్‌లో మిల్నేకు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. తర్వాత కెప్టెన్‌ స్మిత్, ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠికి జతయ్యాడు. రెండో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. ఇద్దరూ కుదురుకుంటున్న ఈ తరుణంలో త్రిపాఠి (28 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్‌)ని నేగి ఔట్‌ చేశాడు. దీంతో మనోజ్‌ తివారి క్రీజులోకి వచ్చాడు.

స్మిత్, తివారిలు అడపాదడపా ఫోర్లతో జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. సరిగ్గా మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించాక 108 స్కోరు వద్ద స్మిత్‌ (32 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్‌)ను స్టువర్ట్‌ బిన్నీ పెవిలియన్‌కు పంపాడు. తర్వాత వచ్చిన ధోని (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌), తివారి (35 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మరో వికెట్‌ పడకుండా జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించారు. బద్రీ, నేగి, స్టువర్ట్‌ బిన్నీ తలా ఒక వికెట్‌ తీశారు.

ఒకే ఒక్కడు కోహ్లి!
జట్టులోని పదకొండు మంది కలిసి 96 పరుగులు చేస్తే... నాయకుడు మినహా సహచరులందరిదీ సింగిల్‌ డిజిటే! ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి (48 బంతుల్లో 55; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేసినా... అవతలి వైపు నుంచి కనీస సహకారం లోపించింది. దీంతో జట్టు పరువు నిలిపే మూడంకెల స్కోరైనా సాధించలేకపోయింది. కోహ్లి తర్వాత రెండో అత్యధిక స్కోరు అరవింద్‌ చేసిన 8 (నాటౌట్‌) పరుగులే! చెత్త షాట్లతో హెడ్‌ (2), డివిలియర్స్‌ (3), కేదార్‌ జాదవ్‌ (7), సచిన్‌ బేబి (2), స్టువర్ట్‌ బిన్నీ (1) బ్యాట్లెత్తేశారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ బెంగళూరు లక్ష్యం వైపు కనీసం చూడలేకపోయింది. పుణే బౌలర్లలో ఇమ్రాన్‌ తాహిర్‌ 3, ఫెర్గూసన్‌ 2 వికెట్లు తీశారు.

స్కోరు వివరాలు
రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) మిల్నే (బి) బద్రీ 6; త్రిపాఠి (సి) జాదవ్‌ (బి) నేగి 37; స్మిత్‌ (సి) మిల్నే (బి) బిన్నీ 45; తివారి నాటౌట్‌ 44; ధోని నాటౌట్‌ 21; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 157.
వికెట్ల పతనం: 1–18, 2–58, 3–108.
బౌలింగ్‌: మిల్నే 4–0–35–0, బద్రీ 4–0–31–1, అరవింద్‌ 4–0–30–0, చహల్‌ 2–0–25–0, నేగి 4–0–18–1, బిన్నీ 2–0–17–1.
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి) ఉనాద్కట్‌ 2; కోహ్లి (సి) సబ్‌–మయాంక్‌ (బి) క్రిస్టియాన్‌ 55; డివిలియర్స్‌ (సి) తివారి (బి) ఫెర్గూసన్‌ 3; జాదవ్‌ రనౌట్‌ 7; సచిన్‌ బేబి (సి) స్మిత్‌ (బి) సుందర్‌ 2; స్టువర్ట్‌ బిన్నీ (సి) సుందర్‌ (బి) ఫెర్గూసన్‌ 1; నేగి (సి) క్రిస్టియాన్‌ (బి) తాహిర్‌ 3; మిల్నే (సి) స్మిత్‌ (బి) తాహిర్‌ 5; బద్రీ (బి) తాహిర్‌ 2; అరవింద్‌ నాటౌట్‌ 8; చహల్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 96.
వికెట్ల పతనం: 1–11, 2–32, 3–44, 4–47, 5–48, 6–61, 7–71, 8–82, 9–84.
బౌలింగ్‌: దీపక్‌ 2–0–18–0, ఉనాద్కట్‌ 4–0–19–1, ఫెర్గూసన్‌ 4–1–7–2, క్రిస్టియాన్‌ 4–0–25–1, తాహిర్‌ 4–0–18–3, సుందర్‌ 2–0–7–1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement