
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ బరిలోకి దిగనున్నాడు. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దుసాన్ లాజోవిచ్ (సెర్బియా)తో నేడు జరిగే తొలి రౌండ్‌లో ఆడనున్న ఫెడరర్‌కు సెమీఫైనల్ వరకు గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశం కనిపించడం లేదు. గాయం కారణంగా మాజీ చాంపియన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే వైదొలగడం... ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాజీ విజేత నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరో పార్శ్వంలో ఉండటం ఫెడరర్‌కు కలిసొచ్చే అంశం.
పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున యూకీ బాంబ్రీ... డబుల్స్‌లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, విష్ణువర్ధన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెదున్‌చెజియాన్, పురవ్ రాజా బరిలో ఉన్నారు.
మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), షరపోవా (రష్యా)తోపాటు డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్), వొజ్నియాకి (డెన్మార్క్), టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) టైటిల్ రేసులో ఉన్నారు.
సా.గం. 4.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం