
న్యూయార్క్: ఈ ఏడాది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలనుకున్న ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు షాక్ తగిలింది. యూఎస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ పరాజయం చెందాడు. ఫెడరర్ 6-5, 5-7, 6-7(7/9), 6-7(3/7) తేడాతో జాన్ మిల్మాన్(ఆస్ట్రేలియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌ను పోరాడి గెలిచిన ఫెడరర్.. రెండో సెట్‌ను కోల్పోయాడు.
ఆపై హోరీహోరీగా సాగిన మూడో సెట్ టైబ్రేకర్‌కు దారి తీసింది. ఇందులో మిల్మాన్ పైచేయి సాధించి విజయానికి బాటలు వేసుకున్నాడు. అటు తర్వాత జరిగిన సెట్ కూడా టైబ్రేక్‌కు వెళ్లడంతో మిల్మాన్ వరుస పాయింట్లతో ఫెడరర్‌ను మట్టికరిపించాడు. దాంతో ఫెడరర్ పోరు క్వార్టర్స్‌కు చేరకుండానే ముగిసింది. కాగా, యూఎస్ ఓపెన్ చరిత్రలో 50పైగా ర్యాంకింగ్ ఉన్న ఒక క్రీడాకారుడి చేతిలో ఫెడరర్ ఓటమి పాలు కావడం ఇదే తొలిసారి.
ఇదిలా ఉంచితే, ఎన్నో ఆశలతో యూఎస్ ఓపెన్‌లో అడుగుపెట్టిన రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవాకు నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో షరపోవా 4-6, 3-6 తేడాతో సారెజ్ నావర్రో(స్పెయిన్) చేతిలో ఓటమి చవి చూసింది.
Comments
Please login to add a commentAdd a comment