రోహిత్ శర్మ
బ్రిస్టల్ : టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్‌లో మరో మైలురాయి అందుకున్నాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో రోహిత్ సెంచరీతో భారత్ 7 వికెట్లతో నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సెంచరీతో రోహిత్ టీ20ల్లో మూడు శతకాలు చేసిన రెండో ఆటగాడిగా కొలిన్ మున్రో (న్యూజిలాండ్) రికార్డును సమం చేశాడు. 2015లో దక్షిణాఫ్రికాతో తొలి సెంచరీ సాధించిన ఈ హిట్ మ్యాన్.. గతేడాది శ్రీలంకపై మరో సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌లో 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఓవరాల్ టీ20ల్లో (లీగ్స్ కలుపుకొని) రోహిత్‌కు ఇది 5వ సెంచరీ కావడం విశేషం.
రెండో ఆటగాడిగా..
ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో ఘనతను అందుకున్నాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా ఈ ముంబై క్రికెటర్ గుర్తింపు పొందాడు. ఈ సిరీస్‌లోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ ఘనతను అందుకున్న విషయం తెలిసిందే. కోహ్లి 56 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకొవడంతో వేగంగా ఈ మైలురాయి అందుకున్న క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో ఓవరాల్‌గా రోహిత్ ఐదో స్థానంలో నిలవగా.. అతని కన్న ముందు మార్టిన్ గప్టిల్, మెకల్లమ్, షోయబ్ మాలిక్, కోహ్లిలున్నారు.
అది నాకు తెలుసు..
ఇక ఈ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు అందుకున్న రోహిత్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ ఇది నాలో ఉన్న ప్రత్యేకమైన శైలితో కూడిన ఆట. ఇన్నింగ్స్ ఆరంభంలో పరిస్థితులను అర్థం చేసుకోవడం ముఖ్యం. మేం బంతిని ఎదుర్కొన్నప్పుడే పిచ్ షాట్ బౌండరీలకు సహకరిస్తుందని గ్రహించాం. భారీ షాట్లు ఆడటానికి సరైన ప్రణాళిక రూపొందించి అమలు చేశాం. కొద్ది సేపు కుదురుకుంటే చెలరేగొచ్చన్న విషం నాకు తెలుసు. అదే చేశాను’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ కోహ్లి, రోహిత్‌లు 57 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment