రోహిత్‌కు మలుపు.. గిల్‌కు పిలుపు... | Rohit Sharma likely to open in form Shubman Gill replaces KL Rahul | Sakshi
Sakshi News home page

రోహిత్‌కు మలుపు.. గిల్‌కు పిలుపు...

Published Fri, Sep 13 2019 2:06 AM | Last Updated on Fri, Sep 13 2019 5:40 AM

Rohit Sharma likely to open in form Shubman Gill replaces KL Rahul - Sakshi

అంతా అనుకున్నట్లే జరిగింది... పరిమిత ఓవర్ల హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ కెరీర్‌లో ‘కొత్త ఇన్నింగ్స్‌’ మొదలుకానుంది. దేశవాళీ, ‘ఎ’ జట్టు తరఫున దుమ్ము రేపుతున్న యువ కెరటం శుబ్‌మన్‌ గిల్‌ ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. పేలవ ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌పై ఊహించినట్లే వేటు పడింది. ఇటీవలి వెస్టిండీస్‌ పర్యటనలో జట్టుతో ఉన్న పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను తప్పించడం మినహా పెద్దగా అనూహ్యమేమీ లేకుండానే దక్షిణాఫ్రికా సిరీస్‌కు టీమిండియా ఎంపిక సాగింది.  

 న్యూఢిల్లీ: ‘నాకెప్పుడూ టెస్టుల్లో ఓపెనింగ్‌ అవకాశం రాలేదు. జట్టు మేనేజ్‌మెంట్‌ కోరితే అందుకు సిద్ధం. వన్డేల్లో ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తానని కనీసం ఊహించకున్నా అదలా జరిగిపోయింది. టెస్టుల్లో ఇలాంటి సందర్భమే వస్తే కాదనేది లేదు. నిరూపించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తా. టెస్టులు ఆడాలనేది నా కోరిక. కానీ అది నా చేతుల్లో లేదు’... గతేడాది ఆగస్టులో రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలివి. అప్పటి భారత జట్టు ఓపెనర్ల తీవ్ర వైఫల్యాల దృష్ట్యా తనకు ఏమైనా వీలు దొరుకుతుందేమోనని రోహిత్‌ ఇలా మాట్లాడాడు. సరిగ్గా 13 నెలల అనంతరం అతడి చిరకాల వాంఛ నెరవేరింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనున్న భారత్‌ తరఫున రోహిత్‌ ఓపెనర్‌గా దిగడం ఖాయమైంది.

చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఆధ్వర్యంలోని సెలక్షన్‌ కమిటీ గురువారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో రోహిత్‌కు సంప్రదాయ ఫార్మాట్‌లోనూ ఓపెనర్‌గా ప్రమోషన్‌ దక్కింది. వన్డే, టి20 జట్లకు తాత్కాలిక కెప్టెన్‌ స్థాయికి చేరినా, 2010 నుంచి దోబూచులాడుతున్న టెస్టు స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో హిట్‌మ్యాన్‌ కెరీర్‌కు ఇది ఓ మలుపు. ఇక ఈ జట్టులో పంజాబ్‌ కుర్రాడు శుబ్‌మన్‌ గిల్‌ ఒక్కడే కొత్త ముఖం. ఇతడి రాకతో... వరుస వైఫల్యాల్లో ఉన్న కేఎల్‌ రాహుల్‌కు ఉద్వాసన తప్పలేదు. ముగ్గురు పేసర్లు (ఇషాంత్, షమీ, బుమ్రా)తో సరిపెట్టిన సెలక్టర్లు ఉమేశ్‌ను పక్కనపెట్టారు. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా విశ్రాంతి గడువును పొడిగించారు. స్పిన్‌ బాధ్యతలు మరోసారి అశ్విన్, జడేజా, కుల్దీప్‌ త్రయంపై ఉంచారు. ఈ సిరీస్‌తో మయాంక్‌ అగర్వాల్‌– రోహిత్‌ రూపంలో కొత్త కూర్పు కనిపించనుంది.  

అండర్‌ 19లో అదరగొట్టి... దేశవాళీలో దంచికొట్టి
ప్రతి క్రికెటర్‌ కోరుకునే టెస్టు జట్టు స్థానాన్ని 20 ఏళ్ల వయసులోనే దక్కించుకున్నాడు శుబ్‌మన్‌ గిల్‌. గతేడాది జరిగిన అండర్‌ 19 ప్రపంచ కప్‌లో అందరి కళ్లు సహచరుడు పృథ్వీ షాపై ఉండగా... అతడికి దీటుగా ఆడి వెలుగులోకి వచ్చాడీ పంజాబ్‌ కుర్రాడు. ఆపై ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనూ చెలరేగాడు. ఇప్పటివరకు 14 మ్యాచ్‌ల్లో 72.15 సగటుతో 1,443 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 268. గతేడాది రంజీ సీజన్‌లో పంజాబ్‌ తరఫున ఐదు మ్యాచ్‌ల్లోనే 104 సగటుతో 728 పరుగులు సాధించాడు.

గిల్‌ ఈ ఏడాది జనవరి చివర్లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లాడి 16 పరుగుల చేశాడు. తాజాగా గత నెలలో భారత్‌ ‘ఎ’ తరఫున వెస్టిండీస్‌ ‘ఎ’ జట్టుపై డబుల్‌ సెంచరీ (248 బంతుల్లో 204) బాదాడు. అయితే, వెస్టిండీస్‌ సిరీస్‌కు సీనియర్‌ జట్టులోకి ఎంపిక కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’తో గురువారంతో ముగిసిన నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టుకు ఆడుతూ 90 పరుగులు చేశాడు.  

బోర్డు ఎలెవెన్‌కు రోహిత్‌ సారథ్యం
టెస్టు ఓపెనింగ్‌ స్థానంతో పాటు రోహిత్‌ శర్మకు బోనస్‌గా బోర్డు ప్రెసిడెంట్‌ ఎలెవెన్‌ సారథ్యమూ దక్కింది. ఈ నెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో జరిగే మూడు రోజుల మ్యాచ్‌లో బోర్డు జట్టును రోహిత్‌ నడిపిస్తాడు. ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.  
బోర్డు జట్టు: రోహిత్‌ (కెప్టెన్‌), మయాంక్, ప్రియాంక్‌ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్‌ నాయర్, సిద్దేశ్‌ లాడ్, కేఎస్‌ భరత్, జలజ్‌ సక్సేనా, ధర్మేంద్ర జడేజా, అవేశ్‌ ఖాన్, ఇషాన్‌ పొరెల్, శార్దుల్‌ ఠాకూర్, ఉమేశ్‌ యాదవ్‌.

►మేం రోహిత్‌పై   దృష్టిపెట్టాం. తనకు సామర్ధ్యం ఉన్నందున బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపి కొన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించాం. అతడితో పాటు సెలక్టర్లందరం స్పష్టతతో ఉన్నాం. ఎలా ఆడతాడో చూసి ఓ అభిప్రాయానికి వస్తాం. వన్డేలు, టి20ల తరహాలోనే టెస్టుల్లోనూ ఆడితే ఇక తిరుగుండదు. గిల్‌ ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లో రాణిస్తున్నాడు. కాబట్టి అతడు రెండుచోట్లా బ్యాకప్‌గా ఉంటాడు. ధావన్, విజయ్‌ వైఫల్యాలతో దూరమవడంతో రాహుల్‌కు చాలా మద్దతిచ్చాం. కానీ, టెస్టుల్లో నిలకడ చూపలేకపోయాడు.
– చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement