
అంపైర్ వైపు బ్యాట్ చూపించినందుకు..
ముంబై: ఐపీఎల్-10లో ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ మందలింపుకు గురయ్యాడు. అంపైర్ నిర్ణయం పట్ల అసంతృఫ్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్ రిఫరీ అతడిని తీవ్రంగా మందలించారు. ‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని రోహిత్ శర్మ ఉల్లంఘించాడు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న అతడి ప్రవర్తన నియమావళిలో లెవల్–1 నేరం కిందకు వస్తుండటంతో మ్యాచ్ రిఫరీ మందలించార’ని ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆట పదో ఓవర్ లో సునీల్ నరైన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. అంపైర్ సీకే నందన్ నిర్ణయంపై రోహిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్ వైపు బ్యాటు చూపిస్తూ అసంతృప్తిగా మైదానం వీడాడు.
కాగా, గురువారం ముంబయి ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని ‘డీఆర్‌ఎస్’ సైగలు చేసి మందలింపుకు గురయ్యాడు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడన్న ఆరోపణతో ధోనిని మ్యాచ్ రిఫరీ మనూ నాయర్ తీవ్రంగా మందలించారు.