ఖలీ బెల్ట్ నా దగ్గరే ఉంది: రోహిత్
ఖలీ బెల్ట్‌కోసం గొప్ప ప్రయత్నం చేశారు మిత్రులారా.. కానీ ఆ బెల్ట్ నాదగ్గరే ఉంది..
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్నేహితుల దినోత్సవం సందర్భంగా డబ్ల్యూడబ్ల్యూ రెజ్లర్ ది గ్రేట్ ఖలీని కలిసిన విషయం తెలిసిందే. కానీ తెలియని విషయం ఏమిటంటే అదే రోజు ఈ గ్రేట్ ఇండియన్ రెజ్లర్‌తో భారత ఆటగాళ్లు హర్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ఈ ఫోటోలను బయటపెట్టింది ఎవరో తెలుసా..? టీమిండియా మరో ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఓ మంచి క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో ఈ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.
అంతే ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక క్యాఫ్షన్‌గా ఎం పెట్టాడో తెలుసా..‘ ఖలీ రెజ్లింగ్ బెల్ట్ కోసం గొప్ప ప్రయత్నం చేశారు మిత్రులారా.. కానీ ఆ బెల్ట్ నాదగ్గరే ఉంది’ అని డబ్ల్యూడబ్ల్యూఈ బెల్ట్‌తో ఉన్న ఫోటోతో వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ఐపీఎల్-10 ట్రోఫీని ముంబై ఇండియన్స్ జట్టు గెలుచుకున్న సందర్భంగా 14 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ట్రిపుల్ హెచ్ తన టైటిల్(బెల్టు)ని రోహిత్ శర్మకి కానుకగా అందించిన విషయం తెలిసిందే. అదే బెల్టుతో ఈ ముంబై స్టార్ ఫోజు ఇచ్చాడు.
రెండో టెస్టు అనంతరం దొరికిన సమయాన్ని సరదాగా గడిపిన క్రికెటర్లు మూడో టెస్టుకు సిద్దమయ్యారు. రెండు రోజుల విశ్రాంతి అనంతరం ప్రాక్టీస్ మొదలు పెట్టారు. టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని కోహ్లీసేన భావిస్తోంది. ఇక మూడో టెస్టు ఆగస్టు 12న పల్లకిలా వేదికగా జరగనుంది.