రాస్ టేలర్ డబుల్ సెంచరీ
విలియమ్సన్ శతకం
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 510/6
ఆసీస్‌తో రెండో టెస్టు
పెర్త్: ‘వాకా’ పిచ్‌పై పరుగుల వరద పారుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌కు దీటుగా న్యూజిలాండ్ బదులిస్తోంది. రాస్ టేలర్ (308 బంతుల్లో 235 బ్యాటింగ్; 34 ఫోర్లు) అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టగా... కేన్ విలియమ్సన్ (250 బంతుల్లో 166; 24 ఫోర్లు) సిరీస్‌లో వరుసగా రెండో శతకం సాధించాడు. దీంతో రెండో టెస్టులో కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 129 ఓవర్లలో ఆరు వికెట్లకు 510 పరుగులు సాధించింది. ఆసీస్‌కన్నా ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది. కెరీర్‌లో టేలర్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ. అలాగే ఆసీస్‌పై ఓ కివీస్ ఆటగాడు ద్విశతకం సాధించడం ఇదే తొలిసారి. కాగా విలిమయ్సన్ 25 ఏళ్ల వయసులోనే కనీసం 12 సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. గతంలో సచిన్ (16), బ్రాడ్‌మన్ (13), కుక్ (12) సెంచరీలు చేశారు. అలాగే గత ఏడు టెస్టుల్లో విలియమ్సన్‌కిది ఐదో సెంచరీ కావడం విశేషం. అంతకుముందు 140/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు ఆట ప్రారంభించిన కివీస్‌కు టేలర్, విలిమయ్సన్ జోడి మూడో వికెట్‌కు 265 పరుగుల భారీ భాగస్వామ్యం అందించింది.
క్రికెట్ చరిత్రలో గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతి విసిరిన ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడిగా మిషెల్ స్టార్క్ నిలిచాడు. స్టార్క్ తన 21వ ఓవర్లో టేలర్‌కు వేసిన నాలుగో బంతి 160.4 కి.మీ రికార్డు వేగంతో దూసుకెళ్లింది. గతంలో పాక్ పేసర్ షోయబ్ అక్తర్ (161.3 కి.మీ.), ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్ లీ.. షాన్ టెయిట్ (161.1), థామ్సన్ (160.6 కి.మీ.) ఈ ఫీట్‌ను సాధించారు.