కోహ్లి(సేన)ని ఆపతరమా! | royal challengers bengaluru enters inti play offs | Sakshi
Sakshi News home page

కోహ్లి(సేన)ని ఆపతరమా!

Published Mon, May 23 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

కోహ్లి(సేన)ని ఆపతరమా!

కోహ్లి(సేన)ని ఆపతరమా!

ప్లే ఆఫ్‌లో చోటు
ఢిల్లీకి తప్పని నిరాశ
కోహ్లి అజేయ అర్ధ సెంచరీ

 
 
పోరాటమంటే బెంగళూరుదే... వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో అనుకున్నది సాధించింది. అత్యద్భుత ప్రదర్శనతో సగర్వంగా ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లు కాస్త ఇబ్బంది పెట్టినా పరిస్థితులకు తగ్గట్టు ఆడిన కోహ్లి మరోసారి అండగా నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మెరుగైన రన్‌రేట్ ఆధారంగా పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అటు పేలవ బ్యాటింగ్‌తో ఢిల్లీ మూల్యం చెల్లించుకుని ఐపీఎల్ నుంచి నిష్ర్కమించింది.
 
 
రాయ్‌పూర్: ఇరు జట్లకిదే చివరి లీగ్ మ్యాచ్.. గెలిచిన జట్టుకే ప్లే ఆఫ్‌లో చోటు.. కానీ ఒత్తిడిని అధిగమించలేకపోయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కీలక మ్యాచ్‌లో చతికిలపడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం తమ లక్ష్యాన్ని అందుకుంది. తొలి మూడు ఓవర్లలోనే గేల్, డివిలియర్స్‌ను కోల్పోయినా విరాట్ కోహ్లి (45 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు) మరోసారి జట్టుకు మూలస్తంభంలా నిలిచాడు. ఫలితంగా ఆదివారం షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఢిల్లీ బౌలర్లు చివరి వరకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 138 పరుగులు చేసింది. ఓపెనర్ డి కాక్ (52 బంతుల్లో 60; 5 ఫోర్లు; 1 సిక్స్) ఒంటరి పోరుకు ఢిల్లీ బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది.

యజువేంద్ర చాహల్‌కు మూడు, గేల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బెంగళూరు 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 139 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.

 డి కాక్ ఒంటరి పోరు
 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డి కాక్ అద్భుత ఇన్నింగ్స్ మినహా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రెండో ఓవర్‌లోనే జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రిషబ్ (1)ను శ్రీనాథ్ అవుట్ చేశాడు. అటువైపు డి కాక్ మాత్రం వేగంగా ఆడేందుకు ప్రాధాన్యమిస్తూ నాలుగో ఓవర్‌లో సిక్స్, ఫోర్ బాదాడు. కానీ ఆరో ఓవర్‌లో ఢిల్లీకి మరో ఝలక్ తగిలింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చివరికంటా నిలబడి జట్టుకు కీలక విజయాన్ని అందించిన కరుణ్ నాయర్ (10 బంతుల్లో 11; 1 సిక్స్)ను చాహల్ వెనక్కి పంపాడు. మిడాఫ్‌లో కొట్టిన భారీ షాట్‌ను కోహ్లి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లి తీసుకున్న ఈ సూపర్బ్ క్యాచ్ టోర్నీలో హైలైట్ క్యాచ్‌ల్లో ఒకటిగా నిలుస్తుంది. పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 48/2 పరుగులు చేసింది. సంజూ శామ్సన్ (12 బంతుల్లో 17; 1 ఫోర్; 1 సిక్స్) ఉన్న కొద్దిసేపు వేగంగా ఆడినా చాహల్ అతణ్ని కూడా దెబ్బతీశాడు.  డి కాక్‌ను 17వ ఓవర్‌లో చాహల్ అవుట్ చేయడంతో ఢిల్లీ జట్టు భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది.


 కోహ్లి.. అదే జోరు
స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును ఆరంభంలోనే ఢిల్లీ వణికించినా నిలకడైన బ్యాటింగ్‌తో కోహ్లి తుది కంటా క్రీజులో నిలిచి ఆదుకున్నాడు. రెండో ఓవర్‌లో మోరిస్ బంతికి క్రిస్ గేల్ (1) బౌల్డ్ కాగా మూడో ఓవర్‌లో డివిలియర్స్ (6)ను జహీర్ పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి స్కోరు 17 పరుగులు మాత్రమే. ఈ సమయంలో కోహ్లికి జతగా రాహుల్ కలిశాడు. ఇద్దరూ కాసేపు దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో  బెంగళూరు జట్టు స్కోరు 49/2కి చేరింది. సమన్వయంతో ముందుకెళుతున్న ఈ జోడిని బ్రాత్‌వైట్ విడదీశాడు. రాహుల్‌ను బౌల్డ్ చేయడంతో మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

ఈ దశలో పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు సహకరించడంతో వాట్సన్ (18 బంతుల్లో 14; 1 సిక్స్), కోహ్లి ఆచితూచి ఆడారు. 14వ ఓవర్‌లో ఓ సిక్స్ బాదిన వాట్సన్‌ను మరుసటి ఓవర్‌లోనే నేగి అవుట్ చేశాడు. చివరి 30 బంతుల్లో 28 పరుగులు రావాల్సి ఉండగా బిన్నీ (11 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) సహకారంతో మరో 11 బంతులుండగానే కోహ్లి మ్యాచ్‌ను ముగించాడు.

 స్కోరు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) జోర్డాన్ (బి) చాహల్ 60; రిషబ్ పంత్ (సి) రాహుల్ (బి) శ్రీనాథ్ 1; కరుణ్ నాయర్ (సి) కోహ్లి (బి) చాహల్ 11; శామ్సన్ (సి) రాహుల్ (బి) చాహల్ 17; బిల్లింగ్ (సి) గేల్ (బి) జోర్డాన్ 4; నేగి (సి) డివిలియర్స్ (బి) గేల్ 6; బ్రాత్‌వైట్ (సి) వాట్సన్ (బి) గేల్ 1; మోరిస్ నాటౌట్ 27; జయంత్ యాదవ్ రనౌట్ 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 138.


వికెట్ల పతనం: 1-11, 2-42, 3-71, 4-81, 5-96, 6-98, 7-107, 8-138.
బౌలింగ్: స్టువర్ట్ బిన్నీ 2-0-15-0; శ్రీనాథ్ అరవింద్ 4-0-28-1; జోర్డాన్ 2-0-10-1; వాట్సన్ 4-0-27-0; చాహల్ 4-0-32-3; అబ్దుల్లా 2-0-14-0; గేల్ 2-0-11-2.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (బి) మోరిస్ 1; కోహ్లి నాటౌట్ 54; డివిలియర్స్ (సి) రిషబ్ (బి) జహీర్ 6; రాహుల్ (బి) బ్రాత్‌వైట్ 38; వాట్సన్ (సి) బిల్లింగ్స్ (బి) నేగి 14; బిన్నీ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 139.

వికెట్ల పతనం: 1-5, 2-17, 3-83, 4-111.
బౌలింగ్: జహీర్ 4-0-30-1; మోరిస్ 3-0-31-1; నేగి 3-0-19-1; మిశ్రా 4-0-33-0; జయంత్ యాదవ్ 1-0-8-0, బ్రాత్‌వైట్ 3.1-0-18-1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement