మెల్‌బోర్న్: ఈ ఏడాది మార్చిలో భారత్, ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ‘బుర్ర పని చేయని’ ఘటనను ఎవరూ మరచిపోలేరు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించడంతో రివ్యూ కోసం స్మిత్ డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరుల సహాయం కోరే ప్రయత్నం చేయడం... దానిపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభ్యంతరం వ్యక్తం చేయడం సిరీస్ మొత్తంలో అతి పెద్ద వివాదంగా నిలిచింది. మ్యాచ్ తర్వాత కూడా దీనిని తీవ్రంగా విమర్శించిన కోహ్లి... అంతకుముందు కూడా స్మిత్ రెండు సార్లు అలాగే చేశాడని, దాంతో తాను అంపైర్లకు ఫిర్యాదు కూడా చేశానని చెప్పాడు.
అయితే ఇప్పుడు ఈ ఘటనపై మళ్లీ స్మిత్ పెదవి విప్పాడు. తన పుస్తకం ‘ది జర్నీ’లో దీని గురించి రాస్తూ కోహ్లి చేసిన ఆరోపణలను ‘చెత్త’ అంటూ కొట్టి పారేశాడు. ఇదంతా ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బ తీసేందుకు భారత్ పన్నిన వ్యూహంలో భాగమని అతను అన్నాడు. ‘ నేను అప్పటికే రెండు సార్లు రివ్యూ కోసం సహాయం కోరడం చూశానంటూ అంపైర్లకు తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పి మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి దీనికి ఆజ్యం పోశాడు.
ఈ అంశం ఇంత పెద్ద వివాదంగా ఎందుకు మారిందో నాకు అప్పటికి గానీ అర్థం కాలేదు. నాకు తెలిసి నేను అంతకు ముందు డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎలాంటి సూచనలు తీసుకోలేదు. నేను నిబంధనలను ఉల్లంఘించానంటూ ఆ తర్వాత కూడా మ్యాచ్ అంపైర్లు గానీ రిఫరీ క్రిస్ బ్రాడ్ గానీ నన్ను కనీసం అడగకపోవడమే అందుకు నిదర్శనం. సిరీస్‌లో వేడి పెంచేందుకు కోహ్లి తనదైన శైలిలో చేసిన పని అది. అసలు కోహ్లి సరిగ్గా ఏ విషయం గురించి ఆ ఆరోపణలు చేశాడో కూడా నాకు తెలీదు’ అని స్మిత్ వ్యాఖ్యానించాడు.
సిరీస్ ముగిశాక కూడా ఐసీసీ నుంచి ఆ ఘటనల గురించి ఎలాంటి స్పందన రాలేదని, అసలు ఆ తర్వాత ఎప్పుడూ దాని గురించి విరాట్ వివరంగా మాట్లాడలేదన్న స్మిత్... ఆ తర్వాత తాము కలిసినప్పుడు కోహ్లి స్నేహపూర్వకంగానే ఉన్నాడని, తన దృష్టిలో అదంతా ఒక మిస్టరీగా మిగిలి పోయిందని తన మనసులో మాటను వెల్లడించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి ‘డెడ్’గా మారిపోయిన తర్వాత స్టంప్ మైక్రోఫోన్‌లలో వినిపించే సంభాషణలను బయట పెట్టరాదని... అయితే బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ సమయంలో బీసీసీఐ తమకు కావాల్సిన విధంగా వాటిని బయటపెట్టి ఆస్ట్రేలియాను తప్పు పట్టే ప్రయత్నం చేసిందని కూడా స్మిత్ ఆరోపించాడు.
Comments
Please login to add a commentAdd a comment