
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను భారత అండర్-19 క్రికెట్ జట్టులోకి తీసుకున్నారు. వచ్చేనెల శ్రీలంకతో జరగనున్న అండర్-19 సిరీస్‌లో అర్జున్ టెండూల్కర్ భారత జట్టు తరఫున ఆడనున్నాడు. జూలైలో శ్రీలంకలో జరగనున్న ఈ సిరీస్‌లో భాగంగా భారత అండర్-19 జట్టు రెండు ఫోర్ డే మ్యాచులు, ఐదు వన్డే మ్యాచులు ఆడనుంది.
18 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఫోర్‌డే మ్యాచుల్లో భారత జట్టుకు అతను ప్రధాన ఆటగాడు కానున్నాడు. అయితే, ఐదు వన్డే మ్యాచులకు ప్రకటించిన జట్టులో మాత్రం అతన్ని తీసుకోలేదు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉనాలోని జోనల్ క్రికెట్ అకాడమీ (జెడ్‌సీఏ)లో ఏర్పాటుచేసిన క్యాంపులోని ప్రధాన అండర్-19 ఆటగాళ్లలో ఒకడిగా అర్జున్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు.