అభిమానుల గుండెల్లో మాస్టర్ నాటౌట్
భారత క్రికెట్ చరిత్రలో ఎందరో దిగ్గజాలు వెలుగు చూశారు. అద్భుత ఆటతీరుతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. భారత క్రికెట్ను కొత్త పుంతలు తొక్కించిన కెప్టెన్లు, ప్రపంచ కప్లు అందించిన సారథులు, ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన బౌలర్లు, బ్యాట్స్మెన్ ఉన్నారు. ఐతే ఈ జాబితాలో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ది మాత్రం ప్రత్యేక స్థానం. అంతర్జాతీయ క్రికెట్లో కూడా. ఎందరో దిగ్గజ క్రికెటర్లకు సైతం సాధ్యంకాని రికార్డుల్ని సచిన్ పాదాక్రాంతం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో శిఖరాగ్రం వంటి వాడు.
క్రికెట్ గురించి పూర్తిగా తెలియని వారికి కూడా సచిన్ పేరు తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులున్నారు. వీరిలో ప్రపంచ మేటి క్రీడాకారులూ, దేశాధినేతలూ, సినీతారలూ ఉన్నారు. భారత్లో అయితే అభిమానులకు సచిన్ 'క్రికెట్ దేవుడు'. భారత క్రికెట్లో ఎందరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు.. వీడ్కోలు పలికారు కానీ మాస్టర్ రిటైర్మెంట్ను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై టెస్టు తర్వాత ముంబైకర్ ఆటను చూడలేమన్నది వారికి బాధాకరమైన విషయం. ఎందుకంటే సచిన్తో భారత క్రికెట్కున్న అనుబంధం అలాంటిది. రెండు దశాబ్దాలకుపైగా అంతర్జాతీయ కెరీర్లో సచిన్ అసాధారణ ఆటతీరుతో అభిమానుల్ని సమ్మోహితం చేశాడు. రికార్డులకే విసుగొచ్చేలా బ్యాటింగ్ యంత్రం పరుగుల మోత మోగించాడు. అందుకే మాస్టర్ లేని టీమిండియాను ఊహించలేకపోతున్నారు.
ఎంత గొప్ప ఆటగాడికైనా ఏదో ఒకరోజు రిటైర్మెంట్ తప్పదు కదా! సచిన్ 'క్రికెట్ దేవుడు' అయినా కాలచక్రం ఆగదు కదా! ముంబైకర్ చరిత్రాత్మక 200వ టెస్టు, చివరి మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సచిన్కు ఘనమైన వీడ్కోలు పలికేందుకు బాధాతప్త హృదయాలతో సిద్ధమయ్యారు. వేదికతో ముంబైతో సహా దేశమంతటా అభిమానుల్లో సచిన్ ఫీవరే. చర్చంతా ముంబై టెస్టు గురించే. సొంతగడ్డ ముంబైలో గురువారం నుంచి వెస్టిండీస్తో జరిగే రెండో టెస్టు అనంతరం సచిన్ క్రికెట్కు వీడ్కోలు పలకచ్చు కానీ అభిమానుల మనుసుల్లో ఎప్పటికీ నాటౌట్గా మిగిలిపోతాడు. ప్రపంచ క్రికెట్లో ఓ శకం ముగియవచ్చు కానీ చరిత్రలో ఓ పేజీ మిగిలే ఉంటుంది. బెస్టాఫ్ లక్ సచిన్.