సుదీర్ఘ కాలం టీమిండియాకు సేవలందించిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించాకా మళ్లీ రికార్డులేంటని అనుకుంటున్నారా?. తాజాగా ఓ అధ్యయనం వెల్లడించిన కథనాల ప్రకారం సచిన్ ఆ కేటగిరిలోనూ టాప్‌గా నిలిచాడు. ఇప్పటికే అత్యధిక పరుగులు, సెంచరీలు సాధించిన మాస్టర్ బ్లాస్టర్.. అత్యధిక మంది ఆటగాళ్లను ప్రత్యర్థులుగా ఎదుర్కొంది కూడా సచినే కావడం విశేషం. ఇక ఎక్కువ మంది సహచరులతో ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ మూడో స్థానంలో నిలిచాడు.
అసలు విషయమేమిటంటే..
24 సంవత్సరాల సుదీర్ఘ టెస్టు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్‌కు దిగ్గజ ఆటగాళ్లతో అదేవిధంగా యువ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం లభించింది. సచిన్ అలా 110 మంది టీమ్ మేట్స్‌ను కలిగి ఉండి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో గ్రాహం గూచ్ (113), ఫ్రాంక్ వూలే(111) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మరో టీమిండియా మాజీ ఆటగాడు, అండర్ -19 కోచ్ రాహుల్ ద్రవిడ్(93) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఇక ఎక్కువ మంది ప్రత్యర్థి ఆటగాళ్లను ఎదుర్కొన్న జాబితాలో సచినే తొలి స్థానంలో నిలిచాడు. తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో 492 మంది ప్రత్యర్థి ఆటగాళ్లను సచిన్ ఎదుర్కొన్నాడు. కాగా ఈ జాబితాలో వరుసగా వెస్టిండీస్ ఆటగాడు శివ్‌నారాయణ్ చంద్రపాల్(426), జాక్వస్ కల్లిస్(417), ముత్తయ్య మురళీధరన్(415), మహేలా జయవర్దనే(404)లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment