హైదరాబాద్: ప్రస్తుత దశాబ్దం(2000-2020) టీమిండియాదే. అవును. ఎందుకంటే అప్రతిహత విజయాలతో దూసుకపోతున్న టీమిండియా ప్రత్యర్థి జట్లకు సాధ్యం కాని ఘనతలను అందుకుంది. దీంతో ఈ దశాబ్దం ముగిసే వరకు టెస్టుల్లో టీమిండియా ఆగ్రస్థానంలో కొనసాగడం ఖాయం. గత మూడేళ్లుగా టెస్టుల్లో ఆగ్రస్థానంలో కొనసాగుతున్న భారత జట్టు.. ఇప్పటికే ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్‌లో 300 పాయింట్లతో మరే జట్టుకు అందనంత ఎత్తులో నిలిచింది. అంతేకాకుండా విజయాల శాతం, గెలుపోటముల నిష్పత్తిలో దూసుకపోతోంది. ఓ దశాబ్దకాలంలో అత్యధిక సక్సెస్ రేషియో కలిగిన జట్టుగా టీమిండియా తొలిసారి రికార్డు నెలకొల్పింది.
ఈ దశాబ్దంలో ఇప్పటివరకు 106 టెస్టులు ఆడిన భారత్ 55 విజయాలు, 29 అపజయాలను చవిచూసింది. గెలుపోటముల నిష్పత్తి 1.90గా ఉంది. ఇక తర్వాత స్తానంలో దక్షిణాఫ్రికా 1.76తో(89 టెస్టుల్లో 44 విజయాలు, 25 ఓటములు) నిలిచింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్ల సక్సెస్ రేషియో వరుసగా 1.39, 1.30, 1.07, 0.91, 0.79 ఉన్నాయి. ఇలా ఓ దశాబ్దకాలంలో అన్ని మేటిజట్లను అధిగమించి అత్యధిక సక్సెస్ రేషియోను సాధించడం టీమిండియాకు ఇది తొలిసారి. ఇప్పటివరకు క్రికెట్‌ను ఏలిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లే అధిక గెలుపోటముల నిష్పత్తిని కలిగి ఉండేవి. అత్యధికంగా 2000-2010 కాలంలో ఆసీస్ అధ్యధికంగా 4.39 సక్సెస్ రేషియోతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. .
ప్రస్తుత జట్టులోని ప్రతీ ఒక్క ఆటగాడు ఆకలితో వేటాడే సింహంలా రెచ్చిపోతున్నారు. బ్యాటింగ్‌లో సారథి విరాట్ కోహ్లి, పుజారా, అజింక్యా రహానేలు నిలకడగా ఆడుతుండగా.. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, హనుమ విహారీ మెరుపులు మెరిపిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో టీమిండియా ఈ మధ్యకాలంలో మరింత రాటుదేలింది. ముఖ్యంగా పేస్ అటాక్ పదును పెరిగింది. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు పేస్ దళాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. కాగా, స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జట్టుకు తురుపుముక్కలుగా మారారు. సీమ్ పిచ్‌లపై కూడా స్పిన్ తిప్పుతూ జట్టుకు విజయాలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ దశాబ్ద ప్రారంభంలో సచిన్ టెండూల్కర్, మురళీ విజయ్, శిఖర్ ధావన్, ఎంఎస్ ధోని, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ వంటి స్టార్ క్రికెటర్లు టెస్టుల్లో టీమిండియా విజయాలకు బాటలు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment