‘విజయ’వర్ధనే
టెస్టు క్రికెట్‌కు మరో గొప్ప ఆటగాడు వీడ్కోలు పలికాడు. గత రెండేళ్ల వ్యవధిలో పాంటింగ్, కలిస్, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ బ్యాటింగ్ విన్యాసాలను కోల్పోయిన ఈ ఫార్మాట్ ఇప్పుడు శ్రీలంక సీనియర్ ఆటగాడు మహేళ జయవర్ధనే అద్భుత ఆటతీరుకూ దూరం కానుంది. ఈ కళాత్మక ఆటగాడు కూడా తప్పుకోవడం అభిమానులకు కాస్త ఇబ్బంది కలిగించేదే. అయితే సహచరుల నుంచి మాత్రం మహేళకు అద్భుత కానుక అందింది. పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి ఘన వీడ్కోలు పలికారు.
టెస్టు కెరీర్‌కు మహేళ వీడ్కోలు
పాక్‌పై 2-0తో సిరీస్ నెగ్గిన శ్రీలంక
కొలంబో: దాదాపు రెండు దశాబ్దాలుగా తన ఆటతీరుతో క్రికెట్‌కు వన్నె తెచ్చిన శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ మహేళ జయవర్ధనే.. విజయంతో టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులతో పాటు శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స కూడా స్టేడియానికి తరలివచ్చారు. అలాగే మహేళ తల్లిదండ్రులతో పాటు భార్య, పిల్లలు కూడా సాక్షులుగా నిలిచారు. జయవర్ధనేను మ్యాచ్ ముగియగానే తోటి ఆటగాళ్లు భుజాలపైకి ఎక్కించుకుని స్టేడియమంతా కలియతిరిగారు.
పెవిలియన్‌కు చేరగానే దేశాధ్యక్షుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. 17 ఏళ్లుగా టెస్టు క్రికెట్ ఆడిన ఈ మాజీ కెప్టెన్‌ను జట్టు సహచరులతో పాటు పాక్ ఆటగాళ్లు కూడా అభినందించారు. బంగారంతో కూడిన చిన్న బ్యాట్‌ను లంక అధ్యక్షుడు.. జయవర్ధనేకు అందించారు. అలాగే లంక జట్టుతో పాటు పాక్ జట్టు కూడా ఈ దిగ్గజ ఆటగాడికి మెమొంటో అందజేసింది. ఇప్పటికే టి20 ప్రపంచకప్ విజయంతో ఆ ఫార్మాట్ నుంచి వైదొలిగిన తను ఇక 2015 ప్రపంచకప్ వరకు వన్డేలు ఆడనున్నాడు.
అచ్చొచ్చిన సొంత మైదానం
సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (ఎస్‌ఎస్‌సీ)లోనే తొలినాళ్లలో తన కెరీర్‌ను మెరుగు పర్చుకున్న మహేళ ఇదే మైదానంలో సంగక్కరతో కలిసి దక్షిణాఫ్రికాపై 624 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ మ్యాచ్‌లో ఈ స్టార్ ఆటగాడు 374 పరుగులు సాధించాడు. అలాగే ఎస్‌ఎస్‌సీలో తను సాధించిన పరుగులు 27 టెస్టుల్లో 2,921. ఇందులో 11 సెంచరీలున్నాయి. 2006 నుంచి 2009 వరకు ఆ తర్వాత 2012లో శ్రీలంక తరఫున కెప్టెన్‌గా వ్యవహరించిన మహేళ 38 టెస్టులకు నాయకత్వం వహించాడు. ఇందులో 18 విజయాలు, 12 పరాజయాలు, 8 డ్రాలు ఉన్నాయి.
సిరీస్ గెలిచిన లంక
పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టును శ్రీలంక 105 పరుగుల తేడాతో గెలుచుకుంది. తద్వారా 2-0తో సిరీస్ దక్కించుకుంది. 127/7 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన పాక్... గెలిచేందుకు మరో 144 పరుగులు సాధించాల్సి ఉండగా కేవలం 38 పరుగులకే మిగిలిన వికెట్లను కోల్పోయింది. కనీసం గంట కూడా ఆడలేకపోయిన మిస్బా సేన 52.1 ఓవర్లలో 165 పరుగులు చేయగలిగింది. సర్ఫరాజ్ అహ్మద్ (89 బంతుల్లో 55; 2 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. గాయం కారణంగా జునైద్ ఖాన్ బ్యాటింగ్ చేయలేదు. ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన హెరాత్ మొత్తం 14 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా సొంతం చేసుకున్నాడు.
దేశం తరఫున ఆడడం గర్వంగా ఉంది
‘ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అయితే ఈ సమయంలో కన్నీళ్లు పెట్టుకోనని హామీ ఇస్తున్నాను. మాజీ ఆటగాళ్ల సాహచర్యంలో మంచి క్రికెటర్‌గా రూపొందాను. వారితో పాటు ప్రస్తుత ఆటగాళ్లకు కూడా కృతజ్ఞతలు. అధ్యక్షుడు రాజపక్స ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. ఇంకా నాలో కొద్దిపాటి క్రికెట్ మిగిలే ఉంది. కచ్చితంగా దీన్ని వన్డే ప్రపంచకప్ సాధించేందుకు వినియోగిస్తాను. ఇన్నేళ్లుగా శ్రీలంకకు ఆడడం గర్వంగా ఉంది. నా కోసం కష్టపడిన కుటుంబసభ్యులకు కూడా థ్యాంక్స్ చెప్పాల్సిందే. గర్వంతో పాటు అంతులేని ఆపేక్షతో లంక క్యాప్‌ను ధరించాను’
- మహేళ జయవర్ధనే.