సచిన్, ద్రవిడ్ల టెస్టు రికార్డు బ్రేక్!
అబుదాబి:భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ల ఒక టెస్టు రికార్డు బద్ధలైంది. తమ కెరీర్లో ముప్ఫై ఐదు ఏళ్ల తరువాత సచిన్, ద్రవిడ్ లు 12 శతకాలు నమోదు చేస్తే.. తాజాగా ఆ రికార్డును పాకిస్తాన్ ఆటగాడు యూనిస్ ఖాన్ అధిగమించాడు. 35 ఏళ్ల తరువాత అత్యధికంగా టెస్టు శతకాలు చేసిన వారిలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్తో కలిసి రాహుల్, సచిన్, యూనస్ లు ఇప్పటివరకూ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.
అయితే తాజాగా వెస్టిండీస్ తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ఆటగాడు యూనిస్ ఖాన్ ఆ రికార్డును సవరించాడు. ఈ మ్యాచ్లో యూనిస్ శతకం చేయడంతో 35 ఏళ్ల తరువాత అత్యధికంగా 13 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం 39వ ఒడిలో ఉన్న యూనిస్.. ఓవరాల్ గా అతని టెస్టు కెరీర్లో 32 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు. వచ్చే నెల్లో బర్త్ డే జరుపుకోబోతున్న యూనిస్ మరో రికార్డుకు నెలకొల్పాడు. పాక్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ తో కలిసి ఆ దేశ టెస్టు క్రికెట్లో అత్యధిక భాగస్వామ్య పరుగులు సాధించాడు. ఈ జోడి ఇప్పటివరకూ 3156 టెస్టు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.