'సచిన్ అంత గొప్పవాడ్ని కాదు'
న్యూఢిల్లీ: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గ్రేట్ ప్లేయర్ అని, తాను సచిన్ అంత గొప్పవాడిని కాదని ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అంటున్నాడు. టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ పేరిట ఉన్న అత్యధిక టెస్టు పరుగుల రికార్డును కుక్ బ్రేక్ చేస్తాడని ఇటీవల సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. మరో 6-8 ఏళ్లు టెస్టు క్రికెట్ ఆడితే సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించవచ్చని చెప్పాడు. శ్రీలంకతో గురువారం మూడో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో కుక్ మీడియాతో కాసేపు ముచ్చటించాడు. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న కుక్ సేన లార్డ్స్ లో మూడో టెస్ట్ ఆడనుంది. అయితే తనపై ఎన్నో అంచనాలు ఉన్నాయని, వాటిని సాధించేందుకు చాలా సమయం పడుతుందని కుక్ చెప్పాడు.
టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా, ఈ రికార్డు నెలకొల్పిన అతి పిన్న వయస్కుడిగానూ కుక్ ఇటీవల రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ 31 ఏళ్ల 10 నెలల వయసులో ఈ రికార్డు నెలకొల్పగా, కుక్ 31 ఏళ్ల 5 నెలల వయసులోనే ఈ ఫీట్ సాధించి సచిన్ రికార్డు తిరగరాశాడు. కుక్ 128 టెస్టుల్లో 47 సగటుతో 10,042 పరుగులు చేయగా, సచిన్ మొత్తం 200 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 54 సగటుతో 15,921 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ కు మరింత కాలం ఆడాలని ఉందని, అలా చేసినప్పుడే సచిన్ రికార్డును మరోసారి బ్రేక్ చేయగలనని అభిప్రాయపడ్డాడు. తాను జీనియస్ అయినా సచిన్ తనకంటే గొప్ప ఆటగాడని ప్రశంసించాడు. అత్యధిక పరుగుల రికార్డు తిరగరాయాలంటే దాదాపు 6వేల పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరికి మాత్రమే అలాంటి విజయాలు, రికార్డులు సాధ్యమవుతాయని చెప్పాడు. వ్యక్తిగతంగా చూసుకుంటే తనకు చాలా లక్ష్యాలు ఉన్నాయని, ఇంగ్లండ్ టీమ్ కు మరిన్ని విజయాలు సాధించి పెట్టడంపైనే దృష్టిసారిస్తున్నట్లు అలెస్టర్ కుక్ వివరించాడు.