అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు!
బ్యాటింగ్ కొనసాగించిన సచిన్
న్యూఢిల్లీ: విరేచనాల కారణంగా అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకొని బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. 2003 ఐసీసీ ప్రపంచకప్ సూపర్ సిక్స్ దశలో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగిందని చెప్పాడు. ఆనాడు ఎదురైన వ్యక్తిగత అనుభవాన్ని మాస్టర్ తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో పొందుపర్చాడు. ‘ఓ పక్క లంకతో మ్యాచ్. మరోపక్క నాకేమో కడుపులో తిప్పడం మొదలైంది.
డీహైడ్రేషన్ జరుగుతుందనిపిస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ అప్పుడే ఇది మొదలైంది. దాన్నుంచి కోలుకోకముందే ఈ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. దీంతో ఎక్కువ మొత్తంలో ఐసోటోనిక్ డ్రింక్స్ తీసుకున్నా. తొందరగా కోలుకోవాలనే ఉద్దేశంతో శక్తినిచ్చే డ్రింక్స్‌లో టీ స్పూన్ ఉప్పు కలుపుకుని తాగా. కానీ ఫలితం తారుమారైంది. కడుపులో ఒక్కటే కలవరం. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కానీ ఏం చేస్తా! తప్పనిసరి స్థితిలో అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బ్యాటింగ్‌కు దిగా.
డ్రింక్స్ విరామాల్లో డ్రెస్సింగ్ రూమ్‌కు పరుగెత్తడం, వాటిని సరిచేసుకొని వచ్చి బ్యాటింగ్ చేయడం. మ్యాచ్ మధ్యలో అయితే చాలా ఇబ్బందిగా అనిపించింది’ అని సచిన్ తెలిపాడు. ఈ ఉదంతాన్ని పక్కనబెడితే ఆ మ్యాచ్‌లో మాస్టర్ 120 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఓవైపు కడుపులో తిప్పుతుంటే బ్యాటింగ్ చేయడం సరైందికాకపోయినా... చాలా ఓర్పుతో దాన్ని కొనసాగించానన్నాడు. అందుకు తగ్గ ఫలితం దక్కినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు.