
న్యూఢిల్లీ : మార్చి 27... 1994... భారత క్రికెట్ గతిని మార్చిన రోజుల్లో ఇది అత్యంత ప్రధానమైనది. ఇదే రోజున క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చాడు. న్యూజిలాండ్‌పై ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లో 82 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఆ తర్వాతదంతా తెలిసిన చరిత్రే. అప్పటివరకు మిడిలార్డర్‌లో ఆడిన తాను అనూహ్యంగా ఓపెనింగ్‌కు దిగేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా ప్రాధేయపడినట్లు చెప్పాడు. నాటి మ్యాచ్‌లో తన బ్యాటింగ్ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తూ అనుభవాలు పంచుకున్నాడు. ‘అప్పటివరకు వన్డేల్లో వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేసేవారు. ఓపెనింగ్‌కు దిగి నేను ఈ పద్ధతి మార్చాలనుకున్నా. ఇందుకోసం ఒక్క అవకాశం ఇమ్మంటూ, విఫలమైతే మళ్లీ అడగనంటూ జట్టు మేనేజ్‌మెంట్‌ను వేడుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌లో ప్రదర్శనతో నా ఓపెనింగ్‌పై మరో మాటకు తావు లేకపోయింది. అందుకనే... అభిమానులకు ఒక్కటే చెబుతున్నా. విఫలమవుతామనే భయంతో ప్రయోగాలకు వెనుకాడొద్దు’ అని సచిన్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment