
Shikar Dhawan: టీమిండియాలో చోటు దక్కకపోవడంపై వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ తొలిసారి స్పందించాడు. వన్డే జట్టులో స్థానం కోల్పోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధవన్ మాట్లాడుతూ.. టీమిండియా తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు చేయాల్సిందంతా చేశాను.. నా అత్యుత్తమ ప్రదర్శన కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన వారికి టీమిండియాలో చోటు దొరికితే నాకెలాంటి ఇబ్బంది లేదు.. కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం.. టీమిండియా చోటు దక్కనందుకు నాకెంత మాత్రం బాధ లేదు, యువ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడుతున్నారని అన్నాడు.
గబ్బర్ చేసిన ఈ వ్యాఖ్యల్లో వైరాగ్యం స్పష్టమవుతున్నప్పటికీ.. భవిష్యత్తులో టీమిండియాలో చోటుపై అతను ధీమా వ్యక్తం చేయడం కొసమెరుపు. టీమిండియాలో చోటుపై ధవన్ నిజాయితీగా చేసిన ఈ వ్యాఖ్యల పట్ల క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో స్థానంపై ఇంత నిజాయితీగా మాట్లాడే క్రికెటర్‌ను చూడలేమని సోషల్‌మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.
కాగా, ఫామ్ లేమి, వయసు మీద పడటం, పూర్ స్ట్రయిక్ రేట్ వంటి ప్రధాన అంశాల కారణంగా ధవన్ గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. మధ్యమధ్యలో భారత-బి జట్టుకు సారధ్యం వహించిన గబ్బర్.. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 2018 నుంచి టెస్ట్‌లకు, 2021 నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న గబ్బర్.. గతేడాది స్వదేశంలో వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో జరిగిన వన్డే సిరీస్‌ల్లో టీమిండియాకు సారధ్యం వహించాడు.
ఆ మూడు సిరీస్‌ల్లో గబ్బర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మధ్యలో ఇషాన్ కిషన్ (బంగ్లాదేశ్), శుభ్‌మన్ గిల్ (న్యూజిలాండ్)లు వన్డేల్లో డబుల్ సెంచరీలతో విరుచుకుపడటంతో ధవన్‌కు దారులు మూసుకుపోయాయి. ఏదో అడపాదడపా ప్రదర్శనలతో కనీసం వన్డే జట్టులోనైనా కొనసాగుదామనుకున్న ధవన్ ఆశలపై యువ క్రికెటర్లు నీళ్లుచల్లారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సమీప భవిష్యత్తులో ధవన్‌కు టీమిండియా నుంచి పిలుపు వచ్చే ఛాయలు కనబడటం లేదు. టీమిండియా ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ స్థానం పక్కా కాగా.. గిల్ ఫార్మాట్లకతీతంగా అత్యుత్తమ ప్రద్శనలతో సత్తా చాటుతూ జట్టులో పాతుకుపోయాడు. దీంతో ధవన్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ధవన్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు.