
సైనా అలవోకగా...
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి ...
క్వార్టర్స్‌లో భారత స్టార్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్
బర్మింగ్‌హామ్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ సైనా 21-16, 21-9తో బుసానన్ ఆంగ్‌బుమరాంగ్‌పాన్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. 41 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... హైదరాబాదీ సత్తాకు తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి గేమ్‌లో 10-10తో స్కోరు సమమైన తర్వాత సైనా వరుసగా మూడు, ఐదు పాయింట్లు సాధించింది. ప్రత్యర్థి కూడా ఒకటి, ఐదు పాయింట్లు నెగ్గడంతో స్కోరు 16-18గా మారింది. ఈ దశలో భారత క్రీడాకారిణి వరుసగా మూడు పాయింట్లతో గేమ్‌ను ముగించింది. రెండో గేమ్‌లో సైనా తిరుగులేని ఆధిక్యాన్ని చూపెట్టింది.
4-4 తర్వాత వరుసగా ఏడు పాయింట్లు నెగ్గింది. తర్వాత కూడా అదే జోరుతో గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు పి.వి.సింధుకు తొలిరౌండ్‌లోనే చుక్కెదురైంది. పోర్న్‌టిప్ బురాన్‌ప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో 21-18, 17-21, 12-21తో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సమీర్ వర్మ 21-10, 12-21, 19-21 తో 8వ సీడ్ తియాన్ హౌవీ (చైనా) చేతిలో, శ్రీకాంత్ 10-21, 13-21తో నాలుగోసీడ్ మొమోట కెంటో (జపాన్) చేతిలో ఓడారు.
సాయి ప్రణీత్ సంచలనం
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన బొడ్డ సాయి ప్రణీత్ సంచలనం సృష్టించాడు. తొలి రౌండ్‌లో ప్రణీత్ 24-22, 22-20తో ప్రపంచ నంబర్‌వన్, రెండోసీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)పై విజయాన్ని సాధించాడు. 50 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు సంచలన ఆటతీరుతో కెరీర్‌లో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు.