
త్వరలోనే మళ్లీ రాకెట్ పట్టుకుంటా: సైనా
హైదరాబాద్: వచ్చే నెలాఖర్లో రాకెట్ పట్టుకొని బ్యాడ్మింటన్ కోర్టులోకి దిగుతానని భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తెలిపింది. తద్వారా నవంబర్లో పోటీలకు అందుబాటులో ఉండాలని ఆమె భావిస్తోంది. గత నెల ముంబైలో కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయి0చుకున్న ఆమె ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నట్లు చెప్పింది. ‘అక్టోబర్ చివరికల్లా పూర్తిగా కోలుకోవచ్చు. అప్పటిదాకా ఏ టోర్నీ బరిలోకి దిగే అవకాశమే లేదు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్‌సలో 8వ స్థానంలో ఉన్న నేను త్వరలోనే ప్రాక్టీస్ మొదలుపెడతాను.
ఇప్పటికే ఆరు వారాలు విశ్రాంతి తీసుకున్నా... ఇంకా ఐదారు వారాల్లో పూర్తి ఫిట్‌నెస్ సాధించవచ్చని భావిస్తున్నా’ అని 26 ఏళ్ల సైనా తెలిపింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన ఆమె రియో ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. భారత్‌లో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరుగుతోందని... అకాడమీలు, కోచ్‌లు క్రీడాకారులను ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారని ఆమె చెప్పింది. ఈ సందర్భంగా రియోలో రజతం ఎగ్గిన తన సహచర క్రీడాకారిణి పి.వి. సింధును ఆమె మరోసారి అభినందించింది.