సైనా సాధించెన్... | Saina Nehwal wins Australian Open Super Series title | Sakshi
Sakshi News home page

సైనా సాధించెన్...

Published Mon, Jun 13 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

సైనా సాధించెన్...

సైనా సాధించెన్...

ఈ ఏడాది తొలి టైటిల్ నెగ్గిన భారత బ్యాడ్మింటన్ స్టార్
రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కైవసం
ఫైనల్లో చైనా ప్లేయర్ సున్ యుపై విజయం
రూ. 37 లక్షల 66 వేల ప్రైజ్‌మనీ సొంతం

 

సరైన సమయంలో సైనా నెహ్వాల్ సత్తా చాటుకుంది. కొంతకాలంగా నిలకడలేని ఆటతీరుతో తడబడుతోన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. 15 నెలలుగా ఉన్న టైటిల్ కొరతను ఈ హైదరాబాద్ అమ్మాయి తీర్చుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను హస్తగతం చేసుకొని ఈ ఏడాది తన ఖాతాలో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకుంది. తనను తక్కువ అంచనా వేసిన వారికి తగిన సమాధానమిస్తూ... ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌కు ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.

 

సిడ్నీ: ఫైనల్ చేరే క్రమంలో ఇద్దరు ప్రపంచ మాజీ చాంపియన్‌లపై తాను సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని సైనా నెహ్వాల్ నిరూపించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి ఈ ఏడాది తొలి టైటిల్‌ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 11-21, 21-14, 21-19తో ప్రపంచ 12వ ర్యాంకర్ సున్ యు (చైనా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సైనాకు 56,250 డాలర్ల (రూ. 37 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను నెగ్గడం సైనాకిది రెండోసారి. 2014లో తొలిసారి ఆమె ఈ టైటిల్‌ను సాధించింది.

 
71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికీ... ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడి తర్వాతి రెండు గేమ్‌లను నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. గతేడాది మార్చిలో స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించిన అనంతరం సైనా ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే కావడం గమనార్హం. క్వార్టర్ ఫైనల్లో 2013 ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్), సెమీఫైనల్లో 2011 ప్రపంచ చాంపియన్ యిహాన్ వాంగ్ (చైనా)పై గెలిచిన సైనా... ఫైనల్లో మాత్రం ఆరంభంలో తడబడింది. గతంలో సున్ యుపై ఐదుసార్లు నెగ్గిన రికార్డు కలిగిన సైనా తొలి గేమ్‌లో అనవసర తప్పిదాలు చేసి కేవలం 18 నిమిషాల్లో గేమ్‌ను కోల్పోయింది. అయితే రెండో గేమ్‌లో సైనా కోలుకుంది. ఎక్కువ పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఆడుతూ నిలకడగా పాయింట్లు సాధించి 11-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. సైనా శక్తివంతమైన స్మాష్‌లతోపాటు డ్రాప్ షాట్‌లు ఆడుతూ సున్ యుపై ఒత్తిడి పెంచింది. దాంతో సున్ యు కొట్టిన పలుషాట్‌లు నెట్‌కే తగిలాయి. అదే జోరులో సైనా రెండో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. దాంతో ఆధిక్యం దోబూచులాడింది. విరామ సమయానికి సైనా 11-10తో ఒక పాయింట్ ఆధిక్యం సంపాదించింది. అయితే కీలకదశలో సైనా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి 18-14తో నాలుగు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో సున్ యు వరుసగా మూడు పాయింట్లు నెగ్గడంతో సైనా ఆధిక్యం 18-17తో ఒక పాయింట్‌కు చేరింది. కీలక సమయంలో సైనా రెండు వరుస పాయింట్లు సాధించి 20-17తో విజయానికి చేరువైంది. సున్ యు వరుసగా రెండు పాయింట్లు నెగ్గినా... మూడోసారి సైనా సంధించిన స్మాష్‌కు జవాబివ్వలేక సున్ యు కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో భారత స్టార్ విజయం ఖాయమైంది.

 

ఆత్మవిశ్వాసం పెంచే విజయం...
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌కు రెండు నెలల సమయమే ఉంది. మరోవైపు టైటిల్ సాధించి 15 నెలలు దాటింది. ఈ ఏడాది బరిలోకి దిగిన ఏ టోర్నీలోనూ ఫైనల్‌కు చేరలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ టాప్-5లో చోటు కోల్పోయింది. ఈ నేపథ్యంలో భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌పై మెరుగైన ప్రదర్శన చేయాలనే ఒత్తిడి అన్నివైపుల నుంచి ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో సైనా ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించి తనపై ఉన్న ఒత్తిడిని తొలగించుకుంది. 


ఇన్నాళ్లూ చైనాకు చెందిన లీ జురుయ్, యిహాన్ వాంగ్, షిజియాన్ వాంగ్ కఠిన ప్రత్యర్థులుగా ఉన్నారని భావిస్తే... నెమ్మదిగా ఇతర దేశాలకు చెందిన క్రీడాకారిణులు కూడా సైనాను సవాల్ చేయడం ప్రారంభించారు. కరోలినా మారిన్ (స్పెయిన్), తై జు యింగ్ (చైనీస్ తైపీ), మినత్సు మితాని, ఒకుహారా (జపాన్), ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) సైనా ఆటతీరుపై అవగాహన పెంచుకొని ఆమెపై విజయాలు సాధించారు. దాంతో సైనా ఈ ఏడాది ఏ టోర్నీలోనూ సెమీఫైనల్ దశను దాటలేకపోయింది. ఎలాగైనా రియో ఒలింపిక్స్‌కు ముందు ఫామ్‌లోకి రావాలనే ఉద్దేశంతో సైనా తీవ్రంగా శ్రమించింది. కోచ్ విమల్ కుమార్ పర్యవేక్షణలో తన ఆటతీరులోని లోపాలను సరిదిద్దుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎవరూ ఫేవరెట్‌గా అంచనా వేయకున్నా సైనా నిలకడగా రాణించి ఒక్కో అడ్డంకిని అధిగమించింది. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్స్ రచనోక్, యిహాన్ వాంగ్‌లపై అద్భుత విజయాలు సాధించి ఔరా అనిపించింది. రియో ఒలింపిక్స్‌కు రెండు నెలల సమయం ఉంది కాబట్టి సైనా తన ఆటతీరును మరింత సానబెట్టుకోవాలి. ఫిట్‌నెస్‌నూ కాపాడుకోవాలి. కొంతకాలంగా తనకు కొరకరాని ప్రత్యర్థులుగా మారిన కరోలినా మారిన్, తై జు యింగ్‌లతోపాటు చైనా స్టార్ క్రీడాకారిణులపై పైచేయి సాధించే వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ ఇదే జోరును రియోలోనూ సైనా కొనసాగిస్తే ఆమె నుంచి మరోసారి పతకం రావడం ఖాయమనుకోవాలి.  -సాక్షి క్రీడావిభాగం

 

‘బాయ్’ నజరానా రూ. 10 లక్షలు
రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన సైనాను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అభినందించింది. ఆమె విజయానికి ప్రోత్సాహకంగా రూ. 10 లక్షల నజరానాను ప్రకటించింది. ‘అద్భుత విజయం సాధించిన సైనాకు అభినందనలు. ఆమె కెరీర్‌లో ఈ గెలుపు మరో మైలురాయిలాంటిది. రియో ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ విజయం ఆమెకు దోహదపడుతుంది. సైనా కోచ్ విమల్ కుమార్, సహాయక సిబ్బందికి కూడా నా అభినందనలు’ అని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా తెలిపారు.

 

10
సైనా సాధించిన సూపర్ సిరీస్ టైటిల్స్ సంఖ్య. ఇందులో ఇండోనేసియా ఓపెన్ (2009, 2010, 2012), సింగపూర్ ఓపెన్ (2010), హాంకాంగ్ ఓపెన్ (2010), డెన్మార్క్ ఓపెన్ (2012), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2014, 2016), చైనా ఓపెన్ (2014), ఇండియా ఓపెన్ (2015) టైటిల్స్ ఉన్నాయి.

 

ప్రధాని అభినందన
ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించిన సైనా నెహ్వాల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ‘అద్వితీయ విజయం సాధించినందుకు అభినందనలు. దేశం యావత్తూ నీ విజయాలకు గర్వపడుతోంది’ అని మోదీ ట్వీట్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సైనాను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement