
సైనా, శ్రీకాంత్‌లకు సవాల్
నేటి నుంచి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
ఫుజౌ (చైనా): గతేడాది అంచనాలకు అందని విధంగా చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు ఈసారి వాటిని నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగుతున్నారు. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నమెంట్‌లో తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన తర్వాత సైనా... స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్ టైటిల్స్ గెలిచాక శ్రీకాంత్ తాము బరిలోకి దిగిన టోర్నమెంట్లలో నిరాశ పరిచారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు డిఫెండింగ్ చాంపియన్స్ ఈసారి టైటిల్స్ నిలబెట్టుకుంటారో లేక తొందరగానే నిష్ర్కమిస్తారో వేచి చూడాలి.
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా పోటీపడుతున్న సైనా తొలి రౌండ్‌లో చైనా యువతార సున్ యుతో తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 4-1తో ఆధిక్యంలో ఉంది. భారత్‌కే చెందిన మరో స్టార్ పీవీ సింధు తొలి రౌండ్‌లో సెనియా పొలికర్‌పోవా (రష్యా)తో ఆడుతుంది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ హాంకాంగ్ ప్లేయర్ హు యున్‌ను ఢీ కొంటాడు. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ మూడో రౌండ్‌లో హు యున్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని శ్రీకాంత్ పట్టుదలతో ఉన్నాడు. మిగతా తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో అజయ్ జయరామ్.. క్వాలిఫయర్‌తో ప్రణయ్ తలపడతారు.
పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం వైదొలగగా... మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో నోకో ఫకుమన్-కురిమి యోనౌ (జపాన్) జంటతో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడీ తలపడుతుంది.