‘నంబర్‌వన్’కు చేరువగా...
ఇండియా ఓపెన్ సెమీస్‌లో సైనా శ్రమించి నెగ్గిన శ్రీకాంత్
పోరాడి ఓడిన ప్రణయ్, గురుసాయిదత్ లిన్ డాన్‌కు సుగియార్తో షాక్
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నీ ఇండియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. గతంలో ఆడిన నాలుగు పర్యాయాల్లో ఒక్కసారి కూడా క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించ లేకపోయిన ఈ హైదరాబాద్ అమ్మాయి... ఐదో ప్రయత్నంలో మాత్రం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు విజయం దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 21-15, 21-12తో హనా రమాధిని (ఇండోనేసియా)పై నెగ్గి తొలిసారి ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనాకు తొలి గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. రెండో గేమ్‌లో మాత్రం సైనా స్పష్టమైన ఆధిపత్యం చలాయించింది. ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాలేదు. సైనాతోపాటు రెండో సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్), మూడో సీడ్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్ లాండ్), యు హాషిమోటో కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు.
శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 37వ ర్యాంకర్ యు హాషిమోటో (జపాన్)తో సైనా ఆడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే సైనా వచ్చే గురువారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది. 1980లో ప్రకాశ్ పదుకొనే తర్వాత ఇప్పటివరకు భారత్ నుంచి ఎవ్వరూ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోలేదు.
హాషిమోటోతో ముఖాముఖి రికార్డులో సైనా 0-1తో వెనుకబడి ఉంది. 2013 ఇండియా ఓపెన్ రెండో రౌండ్‌లో హాషిమోటోతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో సైనా మూడు మ్యాచ్ పాయింట్లను వదులుకొని ఓడిపోవడం గమనార్హం. నాడు ఎదురైన ఓటమికి ఈసారి సైనా లెక్క సరిచేస్తుందో లేదో వేచి చూడాలి.
పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ 23వ ర్యాంకర్ టకూమా ఉయెదా (జపాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 79 నిమిషాల్లో 21-15, 23-25, 21-18తో కష్టపడి గెలుపొందాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో క్వాలిఫయర్ జుయ్ సాంగ్ (చైనా)తో శ్రీకాంత్ ఆడతాడు. మరోవైపు భారత్‌కే చెందిన గురుసాయిదత్, ప్రణయ్ పోరాడి ఓడారు. క్వార్టర్ ఫైనల్స్‌లో గురుసాయిదత్ 21-15, 18-21, 13-21తో జుయ్ సాంగ్ చేతిలో; ప్రణయ్ 21-16, 9-21, 18-21తో ఆరో సీడ్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశారు.
పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్, చైనా దిగ్గజం లిన్ డాన్‌కు క్వార్టర్ ఫైనల్లో ఊహించని పరాజయం ఎదురైంది. ఎనిమిదో సీడ్ టామీ సుగియార్తో (ఇండోనేసియా) అద్భుత ఆటతీరును కనబరిచి 21-17, 15-21, 21-17తో ప్రపంచ మూడో ర్యాంకర్ లిన్ డాన్‌ను ఇంటిముఖం పట్టించాడు. సెమీస్‌లో అక్సెల్‌సన్‌తో సుగియార్తో తలపడతాడు.