
కొలంబో: ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐయూ) ముందు నేడు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర హాజరు కానున్నాడు. 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో లంక ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలత్‌గమగే ఈ ఆరోపణ చేశాడు. అప్పట్లో ఆయన క్రీడల మంత్రిగా వ్యవహరించారు. ఫొన్సెక నేతృత్వంలోని బృందం ఆ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన శ్రీలంక ఆటగాళ్లను విచారిస్తోంది.
గురువారం ఉదయం 9 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా 2011 వరల్డ్‌కప్‌లో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగక్కరను కోరింది. బుధవారం ఓపెనర్ ఉపుల్ తరంగాను రెండు గంటల పాటు విచారించింది. నాటి వరల్డ్‌కప్ ఫైనల్లో తరంగ 20 బంతులు ఆడి రెండు పరుగులు చేశాడు. ‘కమిటీ అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చాను. నా స్టేట్‌మెంట్‌ను వారు రికార్డు చేశారు’ అని తరంగ తెలిపాడు. కానీ ప్రశ్నలేంటో చెప్పలేదు. అప్పట్లో చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరించిన శ్రీలంక విఖ్యాత ఆటగాడు అరవింద డిసిల్వాను మంగళవారం ఆరు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. లంకలో ఫిక్సింగ్‌కు పాల్పడితే క్రిమినల్ నేరం కింద కఠినంగా శిక్షిస్తారు. లంక కరెన్సీలో రూ. 10 కోట్ల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించేలా గత నవంబర్‌లో చట్టం తెచ్చారు.