
సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులకు కొడుకు పుట్టాడు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని మాలిక్, సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా ప్రకటించారు. స్వస్థలం హైదరాబాద్‌లోనే సానియాకు ప్రసవం జరిగింది. ‘చాలా ఉద్వేగంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా. మాకు అబ్బాయి పుట్టాడు. నా అమ్మాయి (సానియా) బాగుంది. ఎప్పటిలాగే ధైర్యంగా కూడా ఉంది. మీ దీవెనలకు కృతజ్ఞతలు. సంతోషంగా అనిపిస్తోంది’ అని షోయబ్ ట్వీట్ చేశాడు. తమ తొలి సంతానానికి వారు ఉర్దూలో ‘దైవకానుక’ అని అర్థం వచ్చే ‘ఇజ్‌హాన్’ అని పేరు పెట్టారు. సానియా, షోయబ్‌లకు 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో వివాహం జరిగింది.
ఆరు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్న 32 ఏళ్ల సానియా సుదీర్ఘ కాలం పాటు డబుల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగింది. 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన 36 ఏళ్ల పాక్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ స్వస్థలం సియాల్‌కోట్. అతను జాతీయ జట్టు తరఫున 35 టెస్టులు, 271 వన్డేలు, 105 టి20 మ్యాచ్‌లు ఆడాడు. సానియా ఇంట బిడ్డ పుట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రికెటర్లు, అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు.