కివీస్ తీరుపై బంగర్ అసహనం
కాన్పూర్: మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆటగాళ్లు తీరు సరిగా లేదంటున్నాడు భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. ఇందుకు కారణం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ పదే పదే వాటర్ బ్రేక్స్ తీసుకోవడమేనట. ముందస్తు షెడ్యూల్ లేని వాటర్ బ్రేక్స్ ను అదే పనిగా తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. ఇలా న్యూజిలాండ్ ఆటగాళ్లు చేయడం వల్ల తమ బౌలర్ల రిథమ్ దెబ్బతిందని అసహనం వ్యక్తం చేశాడు.
ప్రత్యేకంగా శుక్రవారం రెండో రోజు ఆటలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్లు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసే క్రమంలో వారిద్దరూ పలుమార్లు బ్రేక్స్ తీసుకోవడాన్ని పరోక్షంగా బంగర్ విమర్శించాడు. ఈ తరహా అంతరాయం తమ స్పిన్నర్ల టెంపోను భంగపరించదన్నాడు. దీనివల్ల తమ బౌలర్లు మరికొన్ని ఓవర్లు వేసే అవకాశాన్ని కోల్పోయారని బంగర్ పేర్కొన్నాడు.